News

సోంపాళ్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు

116views

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం చెన్నకేశవస్వామి దీపస్తంభం వద్ద అస్పష్టంగా ఉన్న రెండు తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక చోట శ్రీజయాభ్యుదయ అని, మరో చోట జయ సంవత్సరం అని రాసి ఉన్నట్లు వెల్లడించారు.

ఈ వివరాల ప్రకారం.. విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయల హయాం (1529-1542)లో శాసనాన్ని రాశారని, శాసనకాలం సామాన్య శకం 1534 అని వివరించారు. సోంపాళ్యం చెన్నకేశవ గుడి నిర్మాణం 1534 నాట¨కి పూర్తయిందని, దీప స్తంభాన్ని అద్భుతమైన శిల్పకళా సంపదతో తీర్చిదిద్దారని ఆయన విశ్లేషించారు. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఈ దీపస్తంభానికి అలంకరించిన కీర్తి ముఖాలు, గుడి గోపురాలు, గరుడ వాగ్గేయకారుని శిల్పాలు, సంగీత నాట్యకారుల బొమ్మలు, ఊహకు అందని యాళి చిత్రాలు, ఎత్తయిన స్తంభాన్ని అల్లుకుంటూ సాగిన పూల తీగల వంటి ఎన్నో శిల్పాలు.. సోంపాళ్యం ఖ్యాతిని మరో స్థాయిలో నిలబెట్టాయని మైనాస్వామి తెలియజేశారు. పీఠం, 50 అడుగులకు పైగా ఎత్తయిన ఏకశిలా స్తంభం విజయనగర శైలికి అద్దం పడుతున్నాయని అన్నారు. భారత పురాతత్వ శాఖ ఆ స్తంభాన్ని ధ్వజస్తంభంగా పేర్కొన్నప్పటికి, దానిని దీపస్తంభంగానే భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాస్తున్న ‘టెంపుల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్ట్‌ ఆఫ్‌ విజయనగర – హంపి’ అనే ఆంగ్ల పుస్తకంలో సోంపాళ్యం ఆలయం గురించి వివరించానని మైనాస్వామి తెలిపారు.