News

రైతాంగ సమస్యల పరిష్కారానికే భారతీయ కిసాన్ సంఘ్..

186views

దేశంలోని రైతాంగ సమస్యల పరిష్కారం, లాభసాటి ధరల సాధన కోసం భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్ – BKS) నిరంతరం కృషి చేస్తుందని ఈ సంస్థ అఖిల భారత అధ్యక్షులు సాయి రెడ్డి అన్నారు. హైదరాబాదులోని అన్నోజిగూడలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రంలో 26 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభమైన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సమావేశాలలో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విధానాలు, ధరల హామీ, సాగు ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. రైతు హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ బలోపేతం, స్వదేశీ వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా, అఖిల భారత సంఘటన కార్యదర్శి దినేష్ కులకర్ణి, అఖిలభారత కార్యవర్గం పాల్గొన్నారని భారతీయ కిసాన్ సంఘ్-తెలంగాణ ఒక ప్రకటనలో తెలియజేసింది. సమావేశాల ప్రారంభానికి ముందు బికెఎస్ అధ్యక్షులు కె సాయి రెడ్డి భారతమాత పూజ, భగవాన్ బలరాం దీపప్రజ్వలన, ధ్వజారోహణ చేశారు.