
రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై ఒక మహిళ మృతదేహం ఉన్నది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి వద్ద తమ తల్లిని తండ్రి గొంతునొక్కి చంపాడని, ఆటోలో మృతదేహాన్ని తరలించి రైల్వేస్టేషన్ బెంచ్‌పై పడేసి వెళ్లిపోయాడని ఒక పిల్లవాడు పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌లోని మాధేపురా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాధేపురా రైల్వే స్టేషన్‌లో ఒక బెంచ్ మీద మహిళ మృతదేహం ఉన్నది. ఆమె నిర్జీవ శరీరం పక్కన్న ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనిపించారు.
కాగా, ఇది గమనించిన కొందరు ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఇద్దరు పిల్లలను ఆరా తీశారు. తమ తల్లి కాజల్ కుమారి అని, జితాపూర్‌లో నివసిస్తున్నట్లు ఒక పిల్లవాడు పోలీసులకు తెలిపాడు. తండ్రి మహ్మద్ ముర్షిద్ ఇంట్లో తల్లి గొంతునొక్కి చంపాడని, ఆ తర్వాత ఆటోలో తీసుకువచ్చి రైల్వేస్టేషన్‌లో వదిలేసినట్లు ఆరోపించాడు.
మరోవైపు మహిళ మెడ చుట్టూ గొలుసు గుర్తులు ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మహిళ మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.





