
దేశ అదృష్ట భవిష్యత్తును రూపొందించడంలో సమాజానిదే కీలక పాత్ర అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజం బలంగా వుంటేనే దేశ రక్షణ కూడా బలంగానే వుంటుందని, సమాజ వ్యవస్థీకృత బలం ప్రతి పౌరుడికీ శక్తినందిస్తుందన్నారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా డెహ్రాడూన్ లోని నింబువాలాలోని గర్హి కాంట్ హిమాలయన్ కల్చరల్ సెంటర్ లో మాజీ సైనికులు, మాజీ సైనికాధికారులతో ‘‘జన గోష్ఠి’’ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ హాజరయ్యారు.
1857 లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుంచి విప్లవ ఉద్యమాల వరకు వున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, స్వేచ్ఛా జ్వాల ఎన్నటికీ ఆరిపోలేదన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో విన్ స్టన్ చర్చిల్ ను ఉటంకిస్తూ, చరిత్ర నుంచి నేర్చుకోవడం పరిణతి చెందిన జాతీయ స్పృహకు సంకేతం అని అన్నారు.
సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జన్మత: దేశభక్తుడని, స్వాతంత్ర ఉద్యమయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారని, అలాగే నిర్భయంగా పాత్ర కూడా పోషించారన్నారు. వ్యక్తులు బలంగా వుంటేనే దేశం బలంగా వుంటుందని అందుకే వ్యక్తి నిర్మాణమే సంఘ ఏకైక ఉద్దేశమన్నారు. సంఘ్ ఏకైక లక్ష్యం వ్యక్తి నిర్మాణమని, రాజకీయాలు కావని స్పష్టం చేశారు. వ్యక్తి బలంగా వుంటేనే దేశం కూడా బలంగా వుంటుందన్నారు.
ఇక రెండో సమావేశంలో సమావేశానికి హాజరైన వారు అడిగిన ప్రశ్నలకు మోహన్ భాగవత్ సమాధానమిచ్చారు.
జాతీయ భద్రత, అగ్నివీర్ పథకంపై ప్రశ్న అడగ్గా.. అద్భుతమైన నాయకత్వం, సైనిక సంసిద్ధత దేశానికి ఎప్పుడూ అవసరమేనని అన్నారు. అగ్నివీర్ పథకాన్ని ఒక ప్రయోగంగా అభివర్ణిస్తూ, అనుభవం ఆధారంగా, మెరుగుదల మరియు మెరుగుదల కోసం పరిధిని పరిగణించాలని ఆయన అన్నారు.
2. నేపాల్, బంగ్లాదేశ్, పొరుగుదేశాల తో పాటు కశ్మీర్ గురించి మాట్లాడుతూ చారిత్రాత్మకంగా ఒకే సాంస్కృతిక భూభాగంలో భాగమన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, భారత్ పై జరుగుతున్న తిరుగుబాటును ఎదుర్కోడానికి అత్యంత దృఢమైన విధానం అవసరం అని పేర్కొన్నారు.
3. సామాజిక సమరసతపై మాట్లాడుతూ భారతీయ దృక్పథం ప్రకారం చేతనంగా వుండే జీవులతో పాటు, జడ జీవులను కూడా అంతే చైతన్యంతో చూసే సంస్కృతి అని అన్నారు. వసుధైవ కుటుంబకం అన్న స్ఫూర్తే ప్రధాన అంశమని, మానవాళిని, సమాజాన్ని నిలబెట్టేది ధర్మమే అని అన్నారు.
4. సోషల్ మీడియా కేంద్రంగా సైద్ధాంతిక విరోధిత్వంపై మాట్లాడుతూ చర్చలు అర్ధవంతంగా, సంభాషణలు అర్ధవంతంగా సాగే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలన్నారు.
5. కింది స్థాయి వారితో ప్రత్యక్ష సంబంధాలు, సంభాషణల ద్వారా మాత్రమే విధానాలు మరింత ప్రభావ వంతంగా అవుతాయన్నారు. అవినీతి, వ్యక్తిత్వ నిర్మాణం గురించి మాట్లాడుతూ అవినీతి అనేది కేవలం సమస్య కాదని, నైతికతకు సంబంధించింది అని అన్నారు.
6. జాతీయ ఐక్యతకు యూసీసీ ఓ సాధనమని అన్నారు. ఇది సామాజిక సంఘర్షణను తగ్గిస్తుందన్నారు. జనాభా అసమతౌల్యత, మత మార్పిడి, చొరబాట్లపై సమగ్ర విధానాన్ని రూపొందించడం ప్రస్తుత అవసరమని అన్నారు.





