News

ఆవుల సంరక్షణ కోసం “గావ్ గ్వాలా యోజన”

94views

రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “గావ్ గ్వాలా యోజన” ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గోసంరక్షకులను నియమించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిలావర్ కోటా జిల్లాలోని రామ్‌గంజి మండీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రారంభించారు. చెచాట్ తహసీల్‌లోని ఖేర్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 14 మంది గోసంరక్షకులను నియమించారు. పురాతన గోసంరక్షణ సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. వేదికపై కొత్తగా నియమితులైన గోసంరక్షకులకు తలపాగాలు, దండలు అందజేసి సత్కరించారు.

గోసంరక్షకుల బాధ్యతలు
ఈ పథకం కింద నియమితులైన గోసంరక్షకులు ప్రతిరోజూ గ్రామంలోని ఆవులను సమిష్టిగా మేతభూములకు తీసుకెళ్లాలి. రోజంతా వాటిని మేపి, సాయంత్రం యజమానుల ఇళ్లకు సురక్షితంగా చేర్చాలి. ప్రభుత్వం ప్రతి 70 ఆవులకు ఒక గోసంరక్షకుడిని నియమించనున్నట్లు తెలిపింది. ఆవుల సంఖ్య పెరిగినపుడు అవసరాన్ని బట్టి ఇద్దరు లేదా ముగ్గురు గోసంరక్షకులను నియమిస్తారు. ఇక, ప్రతి గోసంరక్షకుడికి నెలకు రూ.10,000 గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. అయితే ఈ మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, దాతల విరాళాల ద్వారా సమకూర్చబడుతుంది. ఈ విధంగా ప్రజల సహకారంతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో మంత్రి మదన్ దిలావర్ మాట్లాడుతూ, దేశీయ ఆవు పాలు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఉపయోగకరమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవుల సంరక్షణను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు మరియు సంప్రదాయ గోసంరక్షణ విధానాన్ని పునరుద్ధరించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గోసంరక్షకులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం అందించడం ద్వారా గ్రామీణ ఉపాధికి కూడా ప్రోత్సాహం లభించనుంది.