News

విద్యార్థుల వికాసం, సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణలో ‘సాందీపని గురుకులం’ కీలక పాత్ర

44views

తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం గింగుర్తి గ్రామంలోని ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’ ప్రాంగణంలో ఉన్న ‘సాందీపని గురుకులం’ వార్షికోత్సవం మరియు నూతన భవనాల ప్రారంభోత్సవ వేడుకలలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

వికారాబాద్‌లోని ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’ ప్రాంగణంలో ఉన్న ‘సాందీపని గురుకులం’ విద్యార్థుల వికాసం, సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ గురుకులం విద్యార్థుల ప్రతిభను, క్రమశిక్షణను ప్రదర్శించే ఒక వేదికగా నిలుస్తుందని , ఇక్కడ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తారని తెలిపారు.

​ఈ సందర్భంగా గురుకులానికి చెందిన నూతన హాస్టల్ భవనం, స్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ భవనాలను ప్రారంభించడంతో పాటు, నూతనంగా నిర్మించనున్న ‘ఆడిటోరియం’, ‘స్టాఫ్ క్వార్టర్స్’ నిర్మాణాలకు లాంఛనంగా భూమిపూజ చేశారు.

​కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన మల్లకంబ, 9 మంది విద్యార్థులు ధోతితో చేసిన నవమాత్, వ్యాయామ యోగ్, లాంగ్ జంప్ వంటి సాహసోపేతమైన, నైపుణ్యంతో కూడిన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలో ​గ్రామీణ ప్రాంతాల్లో విద్యా దీపాలు వెలిగిస్తూ, మన అద్భుతమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, పూజ్యనీయులు శ్రీ వి. భాగయ్య గారు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి , ఇతర ప్రజాప్రతినిధులు, గురుకులం నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

​గ్రామీణ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేశారు.