ArticlesNews

తిరుపతిలో వెలసిన త్రిశూలధారి

21views

ఫిబ్రవరి 8 నుంచి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!

తిరుమల శిఖరాలపై కొలువైన కోనేటిరాయుడు ఎంతటి మహిమాన్వితుడో, తిరుమల శిఖరాల ఆదిలో వెలసిన కపిలేశ్వరస్వామి కూడా అంతే మహిమగలవాడు. అందుకే ఆ శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులు ఈ సదాశివుడిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరు. శివకేశవులకు భేదమే లేదనడానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు, ఈ శశిభూషణులే సాక్ష్యం. జగన్మాత అయిన పార్వతీదేవి ఈ క్షేత్రంలో కామాక్షిదేవిగా ఆరాధనలు అందుకుంటోంది. శ్రీకామాక్షీ సమేతుడైన ఆ ప్రసన్నమూర్తి లింగాకృతిలో కపిలతీర్థంలో పూజలందుకుంటున్నాడు. కపిలమహర్షి తపోఫలంగా వేంకటాచలం దిగువన ఆవిర్భవించిన కాలకంఠుడు కపిలేశ్వరుడిగా ప్రసిద్ధుడయ్యాడు. పరమభక్తుల ప్రార్థనలకు పరమాత్మ ప్రత్యక్షం కావడమే కాదు స్థిరనివాసం చేసుకొని ఉండిపోతాడని నిరూపించాడు. స్వయంభువుగా వెలసిన ఈ కపిలేశ్వరస్వామి ప్రస్తావన వామనపురాణంలోని శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో కనిపిస్తుంది. పాతాళలోకంలో భోగవతి అన్న పేరుతో ప్రవహించే గంగానది తీరంలో కపిలముని శివారాధకుడై పూజలు చేసేవాడు. మునీశ్వరుడి తపస్సుకు మహాదేవుడు ప్రసన్నుడయ్యాడు. శివలింగరూపంలో దినదిన ప్రవర్ధమానమై తిరుమల క్షేత్ర మూలంలో స్వయంభువుగా ఆవిర్భవించాడు. నానాటికీ పెరుగుతున్న శివలింగాన్ని అర్చించేందుకు శ్రీమహావిష్ణువు గోపాలుడిగా మారాడు. బ్రహ్మదేవుడు ధేనువుగా మారి క్షీరధారలు కురిపించాడు. ఇరువురి సేవ, ప్రార్థనలు ఫలించి పరమేశ్వరుడు వేంకటాద్రి పర్వతమూలంలో ఇంకా పెరగకుండా భక్తుల సౌకర్యార్థం స్థాణువుగా మారిపోయాడు.

చారిత్రక నేపథ్యం

పురాణాల్లో ప్రస్తావించిన ఈ క్షేత్రానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. క్రీ.శ.11 వ శతాబ్దంలో ఈ కపిలేశ్వరస్వామిని భక్తులు పూజాదికాలతో కొలిచినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. తిరుపతికి సమీపంలోని కొత్తూరు గ్రామాధికారి మునయదరయ్యన్‌ అప్పటి మహారాజైన రాజేంద్రచోళుడి కింద పనిచేసే గ్రామపెద్ద. ఆయన కపిలేశ్వరస్వామి ఉనికిని గుర్తించటమే కాదు, గర్భాలయంలోని ముఖమండపాలు నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఆయన ప్రచారంతో స్వామి వైభవం నలుదిశలా వ్యాపించిందని భోగట్టా. 15వ శతాబ్దం నుంచి ఈ కపిలేశ్వరస్వామి కోవెలకు  భక్తుల దర్శనం పెరిగింది. విజయనగర మహారాజులైన అచ్యుతరాయలు, సదాశివరాయలు తదితరులు కూడా కపిలేశ్వరస్వామి ఆలయ ఉద్ధరణకు ఇతోధిక సాయమందించినట్లు చరిత్ర కథనం. ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి, కాలభైరవస్వామి, మహాశాస్త, వినాయకస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శివభక్తుడైన చండికేశ్వరస్వామి తదితర మూర్తులు కూడా పరివారదేవతలుగా పూజలందుకుంటున్నారు. శ్రీరుక్మిణీసత్యభామాసమేత వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణుల ఆలయాలు కూడా కపిలేశ్వరస్వామి ప్రాభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి.

పవిత్ర కపిలతీర్థం

కపిలేశ్వరస్వామి కొలువైన ఈ పుణ్యస్థలిలో మరో విశేషం కపిలతీర్థం. శేషాచల పర్వత సానువుల్లోని అనేక పవిత్ర తీర్థాల నుంచి జాలువారిన జలధారలతో ఈ కపిలతీర్థం ఏర్పడింది. పర్వతమూలంలో వెలసిన ఈ ప్రాచీన తీర్థానికి సుదర్శన చక్రత్తాళ్వారు తీర్థం, చక్రత్తాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ నామాల వెనుక ఓ చారిత్రక కథనం ప్రచారంలో ఉంది. విజయనగర చక్రవర్తి, శ్రీవేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన అచ్యుతరాయలు ఈ తీర్థంలో పుణ్యస్నానం చేసి ఈ జలధారకు ‘సుదర్శనచక్ర తీర్థం’ అనే పేరు పెట్టాడు. ఈ పుష్కరిణికి నాలుగు మూలల్లో ‘తిరువాళిక్కళ్‌’ పేర్లతో నాలుగు సుదర్శనచక్ర శిలా యంత్రాలను ప్రతిష్ఠించి.. చక్రత్తాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అనే సార్థక నామాలను కల్పించాడు.

ఉమాపతికి ఉత్సవాలు

కపిలేశ్వరస్వామికి ప్రతి సోమవారం డోలోత్సవం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఏటా మార్గశిర త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో స్వామికి తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. కామాక్షీసమేతుడైన కపిలేశ్వరుడికి ప్రతినెలా మాసశివరాత్రి రోజున సాయంసంధ్యలో కల్యాణోత్సవం జరుపుతారు. ఏటా మాఘమాసంలో పదిరోజుల పాటు కపిలేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవదేవేరు లను వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. మకర, నంది, వ్యాఘ్ర, భూత, తిరుచ్చి, పురుషమృగ వాహనాలపై విహరించడం కపిలేశ్వరస్వామి విశిష్టత.

దశకంఠుని వాహనంపై దేవేశుడు

కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ రావణాసుర వాహనంపై పరమశివుడు విహరించడం. దశకంఠుడు కనబరచిన భక్తిప్రపత్తులకు శంకరుడు అతనికిచ్చిన వరమిది. ఉత్సవాల్లో ధ్వజావరోహణం తర్వాత కామాక్షీ సమేతంగా కపిలతీర్థ స్వామి లంకాధీశుడి వాహనంపై ఊరేగుతాడు. ఈ సందర్భంగా శివభక్తులు రావణాసురుడు ఆలపించిన శివతాండవ స్తోత్రం పఠిస్తూ పరవశించిపోతారు.

త్రిపురాంతకుడికి త్రిశూలస్నానం

కపిలేశ్వరుడికి నిర్వహించే ‘త్రిశూల స్నానం’ బ్రహ్మోత్సవాల్లో చివరి వేడుక. ఈ  విశేషమైన ఘట్టంలో త్రిపురాంతకుడైన పరమశివుడి త్రిశూల ఆయుధానికి కపిలతీర్థంలో స్నానం చేయించడం ఆనవాయితీ. త్రినేత్రుడి శూలం శివభక్తుల పాపాలను హరించి పునీతులను చేస్తుందని విశ్వాసం. ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్లను ఓ పల్లకిపైన, త్రిశూలాన్ని మరో పల్లకి పైన ఆసీనులను చేసి కపిలతీర్థానికి తీసుకువెళ్తారు. అక్కడ పూజాదికాలు ఆచరించి త్రిశూలానికి ఆ పుణ్యతీర్థంలో స్నానం చేయిస్తారు.

ఈ పరమపవిత్ర కార్యక్రమంతో కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.