News

‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అందుకున్న భారత ఉపాధ్యాయురాలు

17views

భారత్‌కు చెందిన ఉపాధ్యాయురాలు రూబల్‌ నాగీ   ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె దీనిని స్వీకరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది విద్యా కేంద్రాలు ఏర్పాటుచేయడం, పెయింటింగ్‌ల ద్వారా మురికివాడల్లో చిన్నారులకు విద్య అందించేందుకు కృషి చేసినందుకు నాగీకి ఈ గుర్తింపు లభించింది. దీని ద్వారా రూ.9 కోట్ల ప్రైజ్‌ మనీని నాగీ అందుకున్నారు.

ముంబయికి చెందిన రూబల్‌ నాగీ.. రూబల్‌ నాగీ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 800 విద్యాకేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు బడికెళ్లే పిల్లలకూ విద్యను అందిస్తున్నారు. సైన్స్‌, గణితం, చరిత్రతోపాటు ఇతర అంశాలను నేర్పించేందుకు గోడలపై చిత్రాలను గీసే విధానాన్ని పాటిస్తున్నారు.

గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ అందుకున్న నాగీ.. ఇది తనతోపాటు భారత్‌కు దక్కిన గౌరవమన్నారు. 24 ఏళ్ల క్రితం 30 మంది చిన్నారులతో కలిసి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టానని.. ఇప్పుడు లక్షలాది మంది ఇందులో భాగస్వామ్యమయ్యారని చెప్పారు. దేశంలోని ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు చేసిన ప్రతి ప్రయత్నం తనకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ ప్రైజ్‌ మనీతో ఉచిత ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.

ఈజిప్టు, ఖతార్‌, యూఏఈలలో పలు విద్యా సంస్థలను నడిపిస్తోన్న జీఈఎంఎస్‌ ఎడ్యుకేషన్‌ .. ‘వర్కీ ఫౌండేషన్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. సమాజంలో అణగారిన వర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు రూబల్‌ నాగీ కృషి చేస్తున్నారని, ఇది వారి జీవితాలను మార్చడమే కాకుండా కుటుంబాల్లో మార్పు తెస్తుందని ఈ సందర్భంగా వర్కీ ఫౌండేషన్‌ పేర్కొంది.