ArticlesNews

పెను సవాళ్ళ కాశ్మీర్‌లో RSS ప్రచారకులు, విస్తారకుల భవ్య ప్రస్తానం

17views
వ్యాసకర్త: అశ్వని కుమార్ ఛ్రుంగూ
(సౌజన్యం: ఆర్గనైజర్)
భారతమాత సేవే లక్ష్యంగా సాగుతూ వస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురీది ఎన్నో మైలురాళ్ళను చేరుకుంది. దేశం కోసం ధర్మం కోసం డాక్టర్ జీ వ్యవస్థాపించిన సంఘ్, ఆ తర్వాత గురూజీ మార్గదర్శకత్వంలో ఎన్నో సవాళ్ళను అధిగమించి శతాబ్దికాల స్ఫూర్తిదాయక చరిత్రను నమోదు చేసుకుంది. డాక్టర్ జీ, గురూజీలు తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చూపిన దేశభక్తి, త్యాగశీలత, అంకితభావం, నిబద్ధత వంటి సంస్కారాలు భారతమాతను శిఖరాగ్ర స్థాయిలో నిలిపింది.
భారతదేశ చరిత్రలోని ఎన్నో చారిత్రక ఘటనల్లో ఆర్ఎస్ఎస్ భాగమై ఉంది. కాగా, కాశ్మీర్‌కు సంబంధించి సంఘ్ మరింత క్రియాశీల పాత్ర పోషించింది. అనేక కుట్రలకు తెరలేపిన షేక్ అబ్దుల్లా చర్యలపై నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఉదాసీనత పాకిస్తాన్‌ని ప్రేరేపించి కాశ్మీరాన్ని కబళించేందుకు కుట్రలు పన్నింది. పాక్ యత్నాలను సంఘ స్వయంసేవకులు ప్రాణాలొడ్డి మరీ తిప్పికొట్టారు. పాక్ కబంధహస్తాల్లోకి కాశ్మీర్ వెళ్ళకుండా రాజా హరిసింగ్‌తో గురూజీ ఎడతెగని చర్చలు జరిపి గొప్ప మేలు చేశారు. పాక్ దళాలను తిప్పికొట్టేందుకు గాను భారత సైన్యాల రాక కోసం రాత్రికి రాత్రి శ్రీనగర్ విమానాశ్రయాన్ని స్వయంసేవకులు బాగు చేశారు. కాశ్మీర్‌లో స్వయంసేవకుల త్యాగాలను తలచుకుంటే హృదయం ద్రవిస్తుంది.
RSS kashmir
సంఘ కార్య శతాబ్ది నేపథ్యంలో కాశ్మీర్‌లో స్వయంసేవకుల సేవల గురించి మరింతగా తెలుసుకోవలసిన అవసరముంది. సంఘ్‌లో పూర్తికాల సేవలందించే స్వయంసేవకులే ప్రచారక్‌లు. సంఘ్ మార్గదర్శకత్వంలో దేశం కోసం జీవితాన్ని అర్పించే ప్రచారక్‌లు అవివాహితులై సనాతన ధర్మంలోని సన్యాసాశ్రమానికి ఏమాత్రం తక్కువ కాని రీతిలో పవిత్ర జీవనం గడుపుతారు. డాక్టర్ హెడ్గేవార్, గురూజీ ఇంకా ఎందరో సంఘ పెద్దలు, జ్యేష్ట కార్యకర్తలు ప్రచారక్‌లుగా విశిష్ట సేవలు అందించారు, అందిస్తున్నారు.
ఇక కాశ్మీర్ విషయానికి వస్తే,1940ల్లోనే జగదీశ్ అబ్రోల్, బల్‌రాజ్ మధోక్, కిదార్ నాథ్ సాహ్నీ, ఓంకార్ నాథ్ కాక్, మాఖన్ లాల్ హర్కరా వంటివారు సంఘ ప్రచారకులుగా అక్కడి నుంచి దేశ సేవలో నిమగ్నమయ్యారు. 1950-51 సంవత్సరాల్లో సంఘ్ స్ఫూర్తితో ప్రజా పరిషద్ ఉద్యమం మొదలైనప్పుడు మరెందరో విద్యావంతులు, అంకితభావంగల కశ్మీరీ యువకులు సంఘ్‌లో భాగమయ్యారు. వీరంతా జమ్మూ, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేశారు. వీరిలో శ్రీనగర్ నుంచి అవతార్ క్రిషన్ కా, నిరంజన్ నాథ్ కౌల్, జాన్‌కీ‌నాథ్ ధోబీ, దేవకీనందన్ నఖాసీ, బ్రిజ్‌నాథ్ మియా, సోమ్‌నాథ్ ఓగ్రా, ప్రాణ్‌నాథ్ మియా తదితరులు ప్రజా పరిషద్ ఉద్యమం కోసం పూర్తిస్థాయిలో ప్రచారక్‌లుగా ఉన్నారు. వీరిలో చాలామందిని ‘అవాంఛిత, అప్రియ’ వ్యక్తులు (Persona non grata)గా షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎంతగా వేధించినప్పటికీ, ఈ ప్రచారక్‌లు 1953లో ఉద్యమం ముగిసిన తర్వాతే ఇంటిబాట పట్టారు.
RSS kashmir
ఆ తర్వాత 1970ల్లో శ్రీనగర్ నుంచి సివిల్ ఇంజనీర్ ఇందర్ క్రిషన్ జుష్టీ, బారాముల్లా నుంచి హోమియోపతి డాక్టర్ రేషన్ లాల్ బలి (హిమాచల్ ప్రచారక్) సంఘ్ కార్యంలో భాగమయ్యారు. 1975లో భదెర్‌వా తెహ్‌సీల్ ప్రచారక్ అయిన ఉపీందర్ భట్ ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయి చాలాకాలం కారాగారవాసం చేశారు. 1978లో ఈ వ్యాసకర్త అశ్వని కుమార్ ఛ్రుంగో కూడా జమ్ములో ప్రచారక్‌గా సేవ చేశారు. 1985లో ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న శ్రీనగర్ వాసి అశోక్ కౌల్ ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తికాల ప్రచారక్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించారు.
ఇక 90వ దశకంలో కాశ్మీర్ నుంచి హిందువుల మూకుమ్మడి వలసల అనంతర కాలంలో బారాముల్లాకి చెందిన వీరేందర్ కుచ్‌రూ రాంబన్ తెహ్‌సీల్‌లో ప్రచారక్ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత వీరిని కరోనా కబళించింది. ప్రస్తుత కేంద్ర పాలిత లద్దాక్‌కి చెందిన ఆశిష్ గంజూ ఆ తర్వాత మూడేళ్ళ పాటు లెహ్ జిల్లా ప్రచారక్ బాధ్యతలను చేపట్టారు. కశ్మీర్‌కి చెందిన మరో జ్యేష్ట స్వయంసేవకులు అమర్‌నాథ్ వైష్ణవి. 1980లో ప్రభుత్వోద్యోగం నుంచి పదవీ విరమణ చేశాక పూర్తికాల వానప్రస్థిగా సంఘ్‌లో చేరారు. తర్వాత వీరు విశ్వహిందు పరిషత్‌కి వెళ్లారు. ఆ సమయంలోనే పంజాబ్ రాష్ట్రంలో వ్యాప్తి చెందిన ఉగ్రవాద వాతావరణం మధ్య సమాజంలో విశ్వాసాన్ని, శాంతిని నెలకొల్పేందుకు సంఘ్ ప్రేరణతో కశ్మీర్నుంచి పంజాబ్ వరకూ చేపట్టిన ‘బలిదాని-జాత’ ఉద్యమానికి అమర్‌నాథ్ నేతృత్వం వహించారు.
కశ్మీర్‌లో ఎందరో స్వయంసేవకులు గత 50 ఏళ్ళ కాలంలో విస్తారకులుగా సేవలందించారు. విస్తారకులు అంటే, ఆర్ఎస్ఎస్‌లో స్వల్పకాలం (సాధారణంగా 1 నుంచి 6 నెలలు) పాటు పూర్తికాల సేవలందించేందుకు ఉద్దేశించిన మరొక వ్యవస్థ. 1972 నుంచి 1977 మధ్య కశ్మీర్‌లో మొదటి తరం విస్తారకులు అక్కడ విస్తారంగా మాతృభూమికి సేవలందించారు. తరువాత, ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ అయిన అశోక్ కౌల్, టెలికమ్యూనికేషన్ విభాగంలో పనిచేసిన సీనియర్ ఇంజనీర్ అనుపమ్ కౌల్ జమ్ము జిల్లాలో విస్తారకులుగా పనిచేశారు. వీరి తర్వాత రాజిందర్ రైనా, చాంద్ జీ భట్, సీనియర్ స్వయంసేవకులు ఉత్పల్ కౌల్, ప్రమోద్ దురానీలు విస్తారక వ్యవస్థలో భాగమయ్యారు.
RSS kashmir
జమ్ము సరిహద్దు ప్రాంతంలో రాజిందర్ చ్రుంగూ 1977-78 మధ్య రెండు సార్లు విస్తారక్‌గా పనిచేశారు. ఈయన ఫుట్ సోల్జర్‌గానూ పనిచేశారు. అదే కాలంలో ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన శిబాన్ క్రిషెన్ పండిత కూడా విస్తారక్‌గా ఉధంపూర్ పట్టణంలో బాధ్యతలు నిర్వహించారు.
పలు సందర్భాలలో ఉత్తర, దక్షిణ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఎందరో స్వయంసేవకులు పూర్తికాల విస్తారకులుగా పనిచేశారు. ప్రత్యేకించి 1947 నాటి దేశవిభజన రోజుల్లో జరిగిన నరమేధపు కాలంలోను, 1967లో జరిగిన హిందువుల ఆందోళన, 1975-77 మధ్య చోటు చేసుకున్న ఎమర్జెన్సీ కాలం, 1986 సంవత్సరంలో కాశ్మీరు లోయలోని ఆలయాలపై ముస్లిం ఛాందసవాదులు చేసిన దాడుల కాలంలోను, రామజన్మభూమి ఉద్యమం రోజుల్లోను విస్తారకులు విశేష సేవలందించారు. వీరంతా తరచుగా స్వయంసేవకుల ఇళ్ళల్లోనే ఆశ్రయం పొంది అక్కడి నుంచే తమ కార్యాన్ని నిర్వర్తించేవారు.
కాశ్మీరులో ఆర్ఎస్ఎస్ కార్యం తీవ్ర సవాళ్ళతో కూడినది. అయితే, స్వయంసేవకులఅంకితభావం, చిత్తశుద్ధి సంఘ్ స్వప్నాలను సాకారం చేశాయి. అక్కడ చాలామంది స్వయంసేవకులు ప్రభుత్వోద్యోగులు కావడం కూడా మరొక సవాల్. అయితే, కాశ్మీర్ లోయలోని స్వయంసేవకులకు అందిన స్ఫూర్తిదాయకమైన శిక్షణ, సంస్కారాలు వారి ద్వారా చారిత్రక పరిణామాలు నమోదయ్యేలా చేశాయి.