
ఆగ్రాలో కొన్ని పోస్టర్లతో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘‘ఈ ఇల్లు అమ్మకానికి వుంది’’ అంటూ దాదాపు 40 కి పైగా ఇళ్లకు ఈ పోస్టర్లను అతికించారు. కాలనీ వాసులే ఇలా చేశారు. భగవాన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. దీంతో ఆగ్రా అంతటా ఇది చర్చనీయాంశమైంది.
పలుకుబడి వున్న ఓ ముస్లిం కుటుంబం ఇదంతా చేస్తోందని, నిరంతరం తమను బెదిరిస్తోందని, దాడులు, వేధింపులకు గురవుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో విసిగిపోయి.. కొందరు ఇప్పటికే ఇళ్లను విడిచి, వెళ్లిపోయారు కూడా.
ఈ కాలనీలో తరుచుగా వివాదాలు, గొడవలు జరుగుతాయని, దీంతో తాము మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు. దీనిని తాళలేక ఇప్పటికే కొన్ని కుటుంబాలు వలస వెళ్లిపోయాయని పేర్కొంటున్నారు.
స్థానికుల కథనం ప్రకారం అక్కడ షాజాద్ కుటుంబం నివసిస్తోందని, అయితే షాజాద్ కుమారుడైన సన్నీ దూకుడు స్వభావం వున్న వ్యక్తి అని, తరుచుగా కాలనీ వాసులతో గొడవలకు దిగుతాడని, శారీరిక హింసకు కూడా పాల్పడతాడని కాలనీవాసులు వెల్లడిస్తున్నారు. సన్నీ కాలనీలోని ప్రజలతో తరచుగా గొడవలకు దిగుతూ, హింసకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని నివాసితులు చెబుతున్నారు.
అంతేకాకుండా కాలనీవాసులు ఓ ఉదాహరణను కూడా వెల్లడించారు. ఈ నెల రెండో తేదీన కాలనీలో ఓ వివాహ వేడుక జరిగిందని, ఆ సమయంలో సన్నీ అక్కడి వచ్చి, ఇంట్లోకి ప్రవేశించి, ప్రజలపై దాడి కూడా చేశాడని పేర్కొంటున్నారు. కుటుంబీకులు ఎదురు తిరగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. స్థానిక కౌన్సిలర్ హరిఓం గోయల్ కూడా ఈ సంఘటనను ధృవీకరించారు. ఆ నిందిత యువకుడి బెదిరింపు ప్రవర్తనతో కాలనీ వాసులు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.ఈ ఘటన జరిగినప్పుడు సన్నీ ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా అదే కాలనీకి చెందిన ప్రీతి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘సన్నీ నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దుర్భాషలాడాడు. దీనిపై అభ్యంతరం చెప్పడంతో బలవంతంగా నా ఇంట్లోకి ప్రవేశించాడు. చివరికి ఎలాగో అలా బయటపడ్డా. ఇలాంటి సంఘటనలు మాకు సాధారణమైపోయాయి. తమ ఇళ్లల్లో కూడా సురక్షితంగా వుండటం లేదని కాలనీ వాసులు భయపడుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానిక నివాసితులు చెబుతున్నారు. దీంతో తాము విసిగిపోయామని, దీనిపై వినూత్నంగా తామే తమ ఇళ్లకు ‘‘ఇల్లు అమ్మకానికి వుంది (“मकान बिकाऊ”) అని బోర్డులు పెట్టుకుంటున్నామని స్థానికులు తెలిపారు. తమకు శాశ్వత పరిష్కారం లభించే వరకూ ఈ పోస్టర్లను తొలగించమని తెగేసి చెబుతున్నారు.





