
50views
భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. అంతకు మంచి గొప్ప ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం నుంచీ ఉంది. ఆహారానికి శరీరంతో మాత్రమే కాదు, మనస్సుతో కూడా సంబంధం కలిగి ఉందని మన పాకశాస్రం బోధిస్తుంది. ఇలాంటి ప్రస్తావన గ్రీకు, ఈజిప్టియన్ లేదా చైనా లాంటి నాగరికతల్లో ఎక్కడా కనిపించదు. భగవద్గీతలోని 17వ అధ్యాయంలోని 8, 9, 10 శ్లోకాలు మన జీవితంలో ఆహారం కారణంగా కనిపించే ఫలితాలను వివరిస్తాయి.
మనలో మూడు రకాల స్వభావాలు.. అంటే సాత్విక, రాజసిక, తామసిక స్వభావాలు గల వ్యక్తులు ఉంటారనీ, మనం తీసుకునే ఆహారం ప్రకారం మానసిక వైఖరిని నిర్ధారించవచ్చని గీత చెబుతోంది. ఇక ఎనిమిదవ శ్లోకంలో..
ఆయు: సత్త్వబలారోగ్య సుఖ ప్రీతి
వివర్ధనా: రస్యా: స్నిగ్దా: స్థిరా హఈద్యా ఆహారా: సాత్త్వికప్రియా
పై శ్లోకంలో ఆహారములు ఆయు: సత్త్వ అంటే ఆయుష్షును పెంచేవి అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యాన్ని, సద్గుణాన్ని, ఆనందాన్ని సంతుష్టిని కలుగజేస్తాయి. శాఖాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా సత్త్వ గుణము పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సాత్త్విక మేధావులు, తత్త్వవేత్తలు ఈ భావాన్నే వ్యక్తీకరించారు. సాత్విక దృక్పథం ఉన్నవారు ఆయుష్షును, బుద్ధిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచే, రుచికరమైన, మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. 14వ అధ్యాయము, 6వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, ప్రశాంతమైనది అనీ, ఒకలాంటి సంతోషాన్ని తృప్తిని కలుగచేస్తుంది అని చెప్పి ఉన్నాడు. సత్త్వ గుణ ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే పరిపూర్ణమైన, శాస్త్రీయమైన, ప్రాచీన ఆహార సంస్కృతి కలిగిన ఏకైక దేశం మనది. వేదాలలో కూడా ఈ విషయం గురించి చెప్పబడింది. రుగ్వేదంలో కూడా ఈ విషయం చెప్పబడింది. యజస్వ తత్వం అంటే శరీరాన్ని గౌరవించండి, దాన్ని కాపాడుకోండి అని. ఇక అథర్వణ వేదంలోని ఆరవ అధ్యాయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయం రాసి ఉంది.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో భోజనం చేసేముందు ప్రార్థన చేసి తింటారు. అయితే భారతీయులు చెప్పే ప్రార్థనలో ఒక విశేషత దాగి ఉంది. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం.
ఓం అన్నపతే అన్నస్య నో దేహి అనమేవస్య సుశ్మిన:।
ప్ర ప్ర దాతారం తారిష్ ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే.
మరొకటి..
ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మనావృతం
బ్రహ్మైవతైవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా..
ఓం సహనావవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై:
ఓం శాంతి: శాంతి: శాంతి:
అంటూ శాంతి మంత్రాన్ని పఠిస్తూ భోజనాన్ని ప్రారంభిస్తాం. కేవలం అన్నం పరబ్రహ్మంగా భావించడమే కాదు, దాన్ని పండించిన రైతు కూడా బాగుండాలని కోరుకునే సంస్కృతి మనది. ఇది మనది అని అనుకుని గర్వపడడంలో తప్పులేదు.





