
సింధు నది జలాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకు భారత్ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై ఇప్పటికే స్వతంత్ర నిపుణుడితో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా ఆర్బిట్రేషన్ కోర్టు విచారణ కోరడం పాకిస్థాన్ చేసిన ‘ఫోరం షాపింగ్’ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఆర్బిట్రేషన్ కోర్టు విచారణను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అతీతంగా ఒప్పందాలు కొనసాగవు’ అని తేల్చిచెప్పింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో సింఽధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టుగా భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి దిగువకు పారే సింధు నది, దాని ఉప నదుల నీరే పాకిస్థాన్‌లో 80శాతానికిపైగా వ్యవసాయానికి ఆధారం. ఈ క్రమంలో భారత్ ఏకపక్షంగా సింధు ఒప్పందాన్ని నిలిపివేసిందంటూ.. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ పిటిషన్ వేసింది. దానిపై ఏర్పాటైన ఆర్బిట్రేషన్ కోర్టు.. సింధు, దాని ఉప నదులపై ఉన్న మూడు జల విద్యుత్ కేంద్రాల్లో నీటి వినియోగానికి సంబంధించిన లాగ్ బుక్స్‌ను అందజేయాలని భారత్‌ను కోరింది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో వాదనలు కొనసాగిస్తామని పేర్కొంది. కానీ భారత్ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. దీనితో పాకిస్థాన్ వాదనలను విని నిర్ణయం తీసుకుంటామని ఆర్బిట్రేషన్ కోర్టు ప్రకటించింది.





