
ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని బంగ్లాదేశ్ నాయకులు పదే పదే బెదిరింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బెదిరింపులు ఓ వైపు, మరో వైపు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధలు ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని, స్థానిక ప్రజలను బెదిరిస్తున్నారు. మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ లో ISIS-K పేరుతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. 2027 నాటికి స్థానికంగా వున్న గారో తెగలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూములను విడిచిపెట్టాలంటూ అందులో హెచ్చరికలు చేశారు.
ఈ నెల 28 వ తేదీన ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఫుబారి, రాజబాలా, తిక్రికిల్లా, సెస్లా, గరోబాధ మరియు తురిసోరి గ్రామాలలో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ గ్రామాలన్నీ బంగ్లాదేశ్ సరిహద్దులోనే వున్నాయి. ‘‘2027 నాటికి ప్లాట్లను ఖాళీ చేయండి. లేదా పరిణామాలను ఎదుర్కోండి’’ అని పోస్టర్లలో వుంది. అచ్చు ఇలాగే అక్టోబర్‌లో, అస్సాంలోని ధుబ్రీ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు తమ భూములను ఖాళీ చేయాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని బెదిరిస్తూ SMS వచ్చింది.
ఇలాంటి పోస్టర్లు రావడంతో అక్కడి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ పోస్టర్ల వెనుక వున్నవారు, వాటిని అతికించింది ఎవరు? దానిపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే.. వెస్ట్ గారో హిల్స్ జిల్లా సరిహద్దు చొరబాట్లు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాంతం అధికారులకు కూడా సవాలుగానే మారింది.





