ArticlesNews

గిరులు.. ఆధ్యాత్మిక సిరులు

25views

మానవాళికి అండదండలు, ధర్మానికీ ధైర్యానికీ ప్రతీకలు, మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు, వాటి శిఖరాలు. పర్వత పాదం నుంచి శిఖరం వరకూ అణువణువూ సందేశం అందిస్తుంది. చిన్నారిని బంగారుకొండ, ధైర్యశాలిని మేరునగధీరుడు అంటాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని, దూరంగా ఉండే కొండలు నునుపని అంటున్నామంటే.. వాటితో మన జీవితం ఎంతగా ముడిపడి ఉందో అవగతమవుతుంది.

పర్వతాలంటే బండరాళ్లే. కానీ అవే మన మనుగడకు ఆనవాళ్లు, ఆశ్రయమిచ్చే ఇళ్లు. ఆది మానవుడి ఆవాసం కొండ గుహలే. భూమండలమంతటా విస్తరిల్లిన పర్వతాల్లో ఒక్కోటి ఒక్కోలా ఉపకరించిన తీరు పురాణేతిహాసాల్లో చూస్తాం. మహాశివుడు హిమవంతుడి తనయ, ప్రకృతికి ప్రతిరూపం అయిన పార్వతిని తనలో సగం చేసుకుని కైలాసంలో కొలువు తీరాడు.

ఒక్క హైందవమే కాదు అన్ని మతాలూ పర్వత విశిష్టతను చాటిచెప్పాయి. పర్వత శిఖరాల్లా సమున్నతంగా స్థిర బుద్ధితో ఉండాలని ఉపదేశించాయి. కొండంత అండగా ఉండాలని, కొండంత ఎత్తున నిలవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. పర్వతాలే లేకపోతే సువిశాల విశ్వంలో భూమి నిలవలేదు. కనుకనే వాటిని భూధరాలంటాం.

ఉదయం నిద్ర లేచి కాలు కింద పెట్టేటప్పుడు ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే..’ అంటూ చదివే శ్లోకంలో పర్వతాల విశిష్టత కనిపిస్తుంది. భూమాత మన తల్లి అనుకుంటే శిశువుకు పాలిచ్చే ఆమె స్తనాలే పర్వతాలు. సకల జీవ రాశులకీ పర్వతాలు ఆహార కేంద్రాలని, వాటిని గౌరవించి పూజించి జాగ్రత్తగా కాపాడుకోవాలన్న సూచన ఆ ప్రార్థనలో ఉంది. అవి ఆహారాన్నే కాదు, చందనం, ఎర్రచందనం వృక్షాలు, కాఫీ, టీ తోటలు- ఇలా సిరిసంపదలనూ అందిస్తాయి. కొండశిఖరాల మీద అద్భుత వన మూలికలు ఉంటాయనటానికి రామాయణంలో లక్ష్మణుడి కోసం హనుమ తెచ్చిన సంజీవని ఓ ఉదాహరణ.

కీలుడు పర్వత శిఖరమై
పూర్వం కీలుడు అనే యక్షుడు జగన్మాత గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు నివసించటానికి వీలుగా కీలుడు పర్వతంలా మారాడు. రాక్షస సంహారం చేసిన తర్వాత మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు పర్వతం మీద కొలువు తీరింది. కీలుడు కీలాద్రిగా మారాడు. ఆ తల్లిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి- ఇంద్రకీలాద్రిగా మారింది. బెజవాడ కనకదుర్గమ్మకు అలా కీలుడు ఆవాసంగా మారాడు.

కులగిరులు
నిశ్చల భక్తి, దృఢదీక్ష, ధర్మప్రబోధలకు ఆదిశేషుడు, హిమవంతుడు, భద్రుడు, కీలుడే కాదు అంతకుముందే.. సృష్టి ప్రారంభం నుంచే భరతవర్షంలో సప్త పర్వతాలు, లేదా కుల గిరులు అని ఓ ఏడు పర్వతాలున్నాయి. వాటి ఉనికిని పరిశీలిస్తే ప్రతి పర్వతం వెనుక ఓ స్ఫూర్తిదాయక అంశం కనిపిస్తుంది. మహేంద్ర, మలయ, సహ్యాద్రి, సుక్తిమాన్, రుక్షా, వింధ్య, పరియాత్ర- ఈ ఏడింటినీ కుల గిరులంటారు. ఇవి భరతఖండం చుట్టూ ఉండి అనేక విధాల మహోపకారం చేస్తున్నాయి. అందుకే కొండ దేవరలను భక్తితో పూజిస్తాం.

గిరి ప్రదక్షిణలు, పూజలు అందుకే
గిరులకు పలు పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణలు చెయ్యటం.. ఆ శిఖరాలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే. గోవర్ధనగిరి పూజ, అరుణాచల గిరి ప్రదక్షిణలను చూస్తే కొండలు దైవ స్వరూపాలేనని అనిపించక మానదు. అందుకే కొండ, గుట్ట అన్నీ మన సంప్రదాయంలో పూజలందుకుంటున్నాయి. కొందరు భక్తులు సదా భగవంతుడి సేవలో తరించాలి- అనుకున్నప్పుడు వారు కోరుకున్న జీవితం పర్వత సమానమే. పర్వతాకారంలో తానుంటే ఆ పర్వతం మీద కొలువుండమని కోరుకున్నాడు రాముణ్ణి భద్రుడు. భద్రుడి మీద రాముడు కొలువుతీరి భద్రాద్రి రాముడయ్యాడు.

ఆదిశేషుడు.. సప్త శిఖరాలై..
కలియుగంలో ప్రజలను కాపాడేందుకు వైకుంఠవాసుడు భూలోకానికి వద్దామనుకున్నప్పుడు ఒక పవిత్ర ప్రదేశం కావలసి వచ్చింది. ఎలా? అని ఆలోచిస్తూంటే ఆదిశేషుడు- ఏడు చుట్టలు చుట్టుకుని
ఏడు పర్వతాలై.. స్వామిని ఏడు కొండల వాడిని చేశాడని‘వరాహ పురాణం’ పేర్కొంది.

రాముడు వర్ణించిన చిత్రకూటం
శ్రీరాముడు వనవాస సమయంలో చిత్రకూట పర్వతం గురించి సీతమ్మకు చెప్పాడు. రంగురంగుల్లో చిత్రంగా ఉన్న ఆ పర్వత సౌందర్యాన్ని వర్ణించాడు. కొన్నిచోట్ల వెండిలా మెరుస్తూ, మరికొన్నిచోట్ల రక్తంలా ఎర్రగా, ఇంకొన్నిచోట్ల అందమైన పసుపు రంగులో ఉండటానికి కారణం ఆయా రంగుల ఖనిజాలేనన్నాడు. పర్వత శ్రేణికి శోభనిచ్చిన ఆమ్ర, జంబూ, ఆసన, లోధ్రా, ప్రియాల, పనస తదితర చెట్ల గురించి ప్రస్తావించాడు. రంగురంగుల రాళ్లు, వేలాది మూలికల సొగసైన కాంతులను చూపించాడు.. పశుపక్ష్యాదులతో మనోహరమైన పర్వత ప్రాంతం ఉల్లాసం కలిగిస్తుందంటూ అక్కడ విహరిస్తున్న కిన్నెర దంపతులను చూపాడు శ్రీరాముడు. అంత అందంగా ఉంటాయనే రాజులు గిరిదుర్గాలు నిర్మించుకున్నారు.

పర్వతాలు ఇంత పుణ్యప్రదమైనవీ, మహోపకారం చేసేవీ కనుకనే ‘శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు’, ‘ఏడుకొండల వాడా, ఆపదమొక్కులవాడా’, ‘గోవర్ధన గిరిధారీ, కైలాస వాసా శివా’- అంటూ ఎన్నో రకాలుగా ఆ పరమాత్మను కీర్తించటం మన సంస్కృతిలో భాగమైంది. అందుకే ‘శిఖరాన్ని ఆదర్శంగా తీసుకో జీవితాన్ని పవిత్రంగా మలుచుకో’ అంటారు పెద్దలు.