ArticlesNews

శాన్ ఫ్రాన్సిస్కో వేదాంత దేవాలయం : ఒక సన్యాసి అకుంఠిత దీక్షకు, త్యాగానికి నిలువుటద్దం!

145views

1914 డిసెంబరులో పొగమంచు కమ్మిన ఒక ఉదయం, శాన్ ఫ్రాన్సిస్కోలోని పాత వేదాంత దేవాలయం లోపల ఒక పెద్ద పేలుడు సంభవించింది. పొగ మరియు పగిలిన అద్దాల మధ్య స్వామి త్రిగుణాతీతానంద గాయపడి ఉన్నారు. తన సొంత శిష్యులలో ఒకడు విసిరిన బాంబు దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

రెండు వారాల తర్వాత, జనవరి 10, 1915న స్వామి కన్నుమూశారు. పాశ్చాత్య దేశాలలో రామకృష్ణ వేదాంత ఉద్యమంలో ఆయన మొదటి అమరవీరుడు అయ్యారు. అయితే ఆయన నిర్మించిన ఆ ఆలయం పాశ్చాత్య దేశాలలో నిర్మించబడిన మొదటి హిందూ దేవాలయాలలో ఒకటిగా నేటికీ నిలిచి ఉంది. అసలు ఆయన ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? 1902లో ఒక సన్యాసి ఆలయ నిర్మాణానికి పూనుకున్న ఆ అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రాల ఆవల ఒక కల 

మరణానికి 12 ఏళ్ల క్రితం, అంటే 1902లో త్రిగుణాతీతానంద స్వామి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అప్పట్లో ఆ నగరం సరికొత్త ఆవిష్కరణలకు నెలవు కానీ, భారతీయ ఆలోచనా విధానంపై అక్కడ అవగాహన తక్కువ. తన గురువు స్వామి వివేకానంద స్ఫూర్తితో, ఆయన కేవలం వేదాంతాన్ని బోధించడమే కాకుండా, భారతీయ విద్యకు నమూనాగా నిలిచేలా ఒక ఆలయానికి రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

“మనం ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిద్దాం — అది మానవాళి యొక్క ఏకత్వాన్ని చాటిచెప్పాలి” అని ఆయన తన కొద్దిమంది అనుచరులతో ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారి వద్ద డబ్బు లేదు, భూమి లేదు, ముందస్తు అనుభవం కూడా లేదు — కేవలం నమ్మకం తప్ప. అయితే, కొద్ది నెలల్లోనే విరాళాలు రావడం మొదలైంది. ఒక ఉపాధ్యాయుడి నుండి 5 డాలర్లు, కూలీల నుండి కొన్ని నాణేలు, ఒక విధవ తన నగలను సైతం ఇచ్చారు. ఇంకా ఒక గుర్తు తెలియని మహిళా భక్తురాలు.. పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు.

Swami Trigunatitananda: The founder-monk who built the first Hindu temple in the Western Hemisphere

అసాధ్యమైన నిర్మాణం: 5 నెలల అంకితభావం

1905 ప్రారంభంలో వెబ్‌స్టర్ స్ట్రీట్‌లో స్థలం ఖరారు అయిన తర్వాత, స్వామి త్రిగుణాతీతానంద, జోసెఫ్ ఎ.లియోనార్డ్ అనే వాస్తుశిల్పిని కలిశారు. స్వామి స్వయంగా కాగితంపై గీసిన చిత్తుచిత్రాలను లియోనార్డ్‌కు అందించారు. అందులో బెంగాల్ దేవాలయ సంప్రదాయాలు మరియు కాలిఫోర్నియా కోట నిర్మాణ శైలుల కలయికతో కూడిన గోపురాలు, తోరణాలు ఉన్నాయి.

“ఇది తూర్పు మరియు పశ్చిమ దేశాల కలయికకు ప్రతీకగా ఉండాలి” అని స్వామి వివరించారు. అలాగే అది బహుళ సంస్కృతుల ఐక్యతకు చిహ్నం కావాలని ఆయన కోరుకున్నారు. లియోనార్డ్ ఆ డిజైన్లను జాగ్రత్తగా పరిశీలించారు. బడ్జెట్ తక్కువ, సమయం చాలా తక్కువ, కానీ స్వామి నిబద్ధతను చూసి ఆయన “వెంటనే పని ప్రారంభిస్తే ఇది సాధ్యమే” అని చెప్పారు.

అలా ఆగస్టు 21, 1905న అక్కడ ఒక ప్రత్యేకమైన పూజ జరిగింది. ఒకవైపు సంస్కృత మంత్రాలు, మరోవైపు ఇంగ్లీష్ ప్రార్థనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. హిందూ పూజారులతో పాటు క్రైస్తవ, యూదు మతస్థులు కూడా ఈ వేడుకకు సాక్షులుగా నిలిచారు. స్వామి స్వయంగా తాపీ పట్టుకుని పునాది రాయి వేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ఒక యజ్ఞంలా సాగింది. స్వామి ప్రతిరోజూ తెల్లవారుజామునే పనుల జరిగే చోటుకు వచ్చేవారు. కూలీల మధ్యే ఉంటూ ప్రతి రాయిని, ప్రతి దూలాన్ని పర్యవేక్షిస్తూ ఆశీర్వదించేవారు. ఆయన ఎంతో సాదాసీదాగా ఉంటూ, నిర్మాణం జరుగుతున్న ఆ భవనంలోనే నిద్రించేవారు.

నిధులు మరియు నమ్మకం

ఆలయ నిర్మాణానికి సుమారు 70,000 డాలర్లు ఖర్చయ్యాయి. 1905వ సంవత్సరంలో అది చాలా పెద్ద మొత్తం. అయితే, ఈ డబ్బు ఏ ఒక్కరి దగ్గరి నుంచో విరాళంగా రాలేదు. వేల సంఖ్యలో చిన్న చిన్న విరాళాల ద్వారా ఈ నిధి సమకూరింది. ఆలయంలో భక్తులు ఇచ్చే కానుకలు, విందులు, ఉపన్యాసాల ద్వారా వచ్చే ఆదాయం మరియు వేదాంత గ్రంథాల అమ్మకాల ద్వారా ఈ సొమ్మును సేకరించారు. స్వామి స్వయంగా చర్చిలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి ప్రసంగాలు చేస్తూ అందరి మద్దతును కూడగట్టారు.

సార్వత్రిక వాస్తుశిల్పం

ఆ నిధులతో వెలసిన ఆలయం.. అద్భుతమైన వాస్తుశైలిని కలిగి ఉంది. బయట వైపు తాజ్ మహల్ వంటి మొఘల్ తోరణాలు, బెంగాల్ పవిత్ర వాస్తుశిల్ప నమూనాలో గోపురాలు, మధ్యయుగ యూరోపియన్ కోటల తరహాలో బురుజులు ఉన్నాయి. లోపల హిందూ చిహ్నాలు ఉన్నప్పటికీ, ధ్యాన మందిరం మాత్రం అన్ని మతాల వారిని ఆహ్వానించేలా నిర్మించబడింది. గోడలపై సంస్కృత, ఇంగ్లీష్ మరియు పాలి భాషలలో ప్రార్థనలు రాసి ఉన్నాయి.

The completed Vedanta Temple showcasing its unique fusion of Eastern and Western architectural traditions, with distinctive white domes

జనవరి 7, 1906 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది. కేవలం 5 నెలల్లోనే ఒక ఆధ్యాత్మిక సంఘం అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసింది. ప్రారంభోత్సవం రోజున వందలాది మంది తరలివచ్చారు. స్వామి ఆచారాలు నిర్వహించడమే కాకుండా, క్రైస్తవ మతగురువులను, యూదు పండితులను కూడా ప్రసంగించాల్సిందిగా కోరారు. ఆ దేవాలయ ద్వారాలు కేవలం ఒక వర్గం కోసం కాకుండా అందరి కోసం తెరవబడ్డాయి.

ఆ సాయంత్రం స్వామి చెప్పిన మాటలను అక్కడివారు ఇలా గుర్తు చేసుకున్నారు. “మనం దీనిని స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో, అచంచలమైన విశ్వాసంతో నిర్మించి ఉంటే, భూకంపం కూడా దీనిని కదిలించలేదు.” స్వామి అన్నట్లుగానే సరిగ్గా అదే సంవత్సరం వచ్చిన శాన్ ఫ్రాన్సిస్కో భూకంపాన్ని ఆ ఆలయం తట్టుకుని నిలబడింది.

వారసత్వం మరియు కొనసాగింపు

2963 వెబ్‌స్టర్ స్ట్రీట్‌లోని ఈ పాత వేదాంత దేవాలయం నేటికీ 1906లో ఉన్నట్లే చెక్కుచెదరకుండా ఉంది. భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయం విదేశీ గడ్డపై కూడా వర్ధిల్లుతుందని, ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుంటుందని ఇది నిరూపించింది.

The Old Vedanta Temple today: A century-old sanctuary that has survived earthquake, fire, and violence, continuing to serve as a meditation center and spiritual landmark

నాగరికత కొనసాగడం అంటేనే ఇది.. గొప్ప వ్యక్తులు నాటిన విత్తనాలు (ఆశయాలు), వారు మరణించినా శాశ్వతంగా నిలిచి ఉంటాయి.