ArticlesNews

నిరసనల నుంచి నీరాజనాల వరకు : ప్రపంచ వేదికపై భగవద్గీత వైభవం

144views

ఒకప్పుడు అమెరికన్ సెనేట్ హాల్‌లో హిందూ శాస్త్రాల శబ్ధం వినిపించగానే.. క్రిస్టియన్ మత మౌఢ్యులు దాన్ని “శాపం” అని అరుస్తూ గోల గోల చేసేవారు. వారు.. దాన్ని జీసస్‌ను అవమానించినట్లుగా చెప్పేవారు. కానీ అదే అమెరికాలో, ఇవాళ హిందూ ధర్మ గ్రంథం శ్రీమద్భగవద్గీతపై చేయివేసి ప్రమాణం చేస్తున్నారు. 2007లో క్రిస్టియన్ మిషనరీలు సెనేట్‌లో హిందూ ప్రార్థన జరిగినప్పుడు ఎలా గొడవ చేశారో.. ఆ తర్వాత ఎలా మార్పు వచ్చిందో మేము మీకు ఈ వ్యాసంలో వివరిస్తాం.

2007 నాటి ఘటన.. తీవ్ర వ్యతిరేకత

ఆ సంఘటన 2007, జూలై 12 న జరిగింది. అప్పుడు నెవాడా.. డెమొక్రాట్ సెనేట్ మెజారిటీ లీడర్ అయిన హ్యారీ రీడ్, అమెరికాలోని ఓక్లహామా రాష్ట్ర సెనేట్‌లో హిందూ పూజారి రాజన్ జెడ్‌ను ప్రార్థన కోసం పిలిచారు. ఒక అమెరికన్ సెనేట్‌లో అధికారికంగా హిందూ ప్రార్థన జరగడం అదే తొలిసారి. నుదుట తిలకం, కాషాయ వస్త్రాలు ధరించిన పూజారి రాజన్ జెడ్ గాయత్రీ మంత్రాన్ని చదవడం మొదలు పెట్టగానే, సెనేట్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అరిచారు. “యేసు క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు!” అంటూ వారు గట్టిగా కేకలు వేశారు.

వ్యతిరేకించిన వారిలో డేవిడ్ ముర్రే, అతని భార్య క్రిస్టన్, ఇంకా లారా బీబౌట్ ఉన్నారు. ఈ ముగ్గురూ ఆ ప్రార్థనను ‘శాపం’ అంటూ, చేతుల్లో బైబిల్‌ను పట్టుకొని ఊపారు. దాంతో క్యాపిటల్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మత స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికాకు ఈ సంఘటన ఒక చీకటి అధ్యాయంలాంటిది. కేవలం రెండు నిమిషాల్లో జరిగిన ఈ గొడవ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. చాలా మీడియా సంస్థలు దీన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాయి.

అలా వ్యతిరేకించిన కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ.. ఆందోళన మాత్రం అక్కడితో ఆగలేదు. 2007 జూన్‌లో, ఈ సంఘటనకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు జరిగాయి. క్రిస్టియన్ మిషనరీలు ఈ హిందూ ప్రార్థనను అమెరికా యొక్క క్రిస్టియన్ వారసత్వంపై దాడిగా పేర్కొన్నాయి. అమెరికన్ ఫ్యామిలీ అసోసియేషన్ (AFA) అనే సంస్థకు సంబంధించిన దాదాపు 22 లక్షల మంది ప్రజలు సెనేటర్లకు ఈమెయిల్‌లు పంపి నిరసన తెలియజేసే కార్యక్రమం చేపట్టారు. వీరు హిందూ ప్రార్థనను ‘అసహ్యకరమైన విగ్రహం’గా అభివర్ణించారు.

AFA సంస్థ ఛైర్మన్ టిమ్ వైల్డ్‌మాన్, ఈ సంఘటన క్రిస్టియన్లకు నైతిక పతనం అని చెబుతూ, సెనేటర్ హ్యారీ రీడ్ కార్యాలయంపై తీవ్ర ఒత్తిడి చేశారు. సంస్థకు చెందిన వారు నిరసనగా 1,43,000 విజ్ఞాపన పత్రాలను సెనేటర్లకు పంపారు. అమెరికన్ ఫ్యామిలీ అసోసియేషన్‌తో పాటు.. సెనేట్‌లో జరిగిన హిందూ ప్రార్థనను వ్యతిరేకించిన వారిలో అమెరికాకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో అమెరికన్ నేవీ మాజీ పాస్టర్ గార్డన్ క్లింగెన్‌స్మిట్ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. క్లింగెన్‌స్మిట్ 2007 జూలై 10న సెనేట్ కార్యాలయాలకు వెళ్లి.. హిందూ ప్రార్థనను వ్యతిరేకించారు. దీని కారణంగా ఆయనపై కోర్ట్ మార్షల్ (సైనిక న్యాయస్థాన విచారణ) కూడా జరిగింది. ఈ సంఘటనలు, ఆ సమయంలో మత సహనం విషయంలో.. అమెరికాలో ఎంతటి అంతర్గత ఘర్షణ ఉందో తెలియజేస్తాయి.

గీతా ప్రమాణం : యుగాంతర మార్పు

అయితే, ఇలా నిరసనలు జరిగిన కేవలం 6 సంవత్సరాల తర్వాత.. అందరినీ కలుపుకునిపోయేది, ప్రపంచ శాంతిని కోరుకునేది కేవలం సనాతన ధర్మం మాత్రమే అని అమెరికా ప్రజలకు అర్థమైంది. ఏ శ్రీమద్భగవద్గీత శ్లోకం చదివినందుకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందో, అదే గీతను చేతబూని అమెరికన్ పార్లమెంట్‌లో ప్రమాణం చేసే సంప్రదాయం మొదలైంది.

తులసి గబార్డ్ (2013) : 2013, జనవరిలో మొదటిసారిగా హిందూ మహిళ తులసి గబార్డ్ (32 ఏళ్లు) అమెరికన్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె పార్లమెంట్‌లో గీతపై చేతివేసి పదవి మరియు గోప్యతా ప్రమాణం చేశారు. తులసి తన ప్రమాణాన్ని గీతలోని నిష్కామ కర్మ సిద్ధాంతంతో పోల్చిచెప్పారు.

తులసి గబార్డ్ తర్వాత అమెరికాలో గీతపై చేతివేసి ప్రమాణం చేసే సంప్రదాయం కొనసాగింది.

2017లో అమెరికన్ ఎంపీ ప్రమీలా జయపాల్ (51 ఏళ్లు) గీతపై ప్రమాణం చేశారు.

2019లో రాజా కృష్ణమూర్తి గీతపై చేతివేసి పదవి మరియు గోప్యతా ప్రమాణం చేశారు. వీరితో పాటు.. తాజాగా అమెరికన్ సెంట్రల్ ఎన్నికల్లో, తూర్పు తీరానికి చెందిన మొదటి భారతీయ మూలాలున్న అమెరికన్ ఎంపీగా ఎన్నికైన సుహాస్ సుబ్రమణ్యం (42 ఏళ్లు) కూడా 2025, జనవరి 7న గీతపై చేతివేసి ప్రమాణం చేశారు.

2007 లో ఏ పూజారి రాజన్ జెడ్ ప్రార్థన చేయడాన్ని వ్యతిరేకించారో, ఆయనే మళ్లీ 2024, జూలైలో రెండోసారి సెనేట్‌లో ప్రార్థన చేశారు. అంతేకాదు అమెరికాతో పాటు.. పాటు యూకే, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాల నుండి 20 మందికి పైగా ప్రముఖ విదేశీ నాయకులు ఇంకా పరిపాలనా అధికారులు.. తమ పదవి ప్రమాణాన్ని గీతపై చేతివేసి చేశారు. ఈ విధంగా, భగవద్గీత అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ధర్మ గ్రంథంగా ఎదిగింది.

ప్రపంచవ్యాప్తంగా గీతపై ప్రమాణాలు

అమెరికాలో గీతపై చేతివేసి ప్రమాణం చేసిన ప్రముఖుల్లో FBI డైరెక్టర్ కాష్ పటేల్,

తూర్పు తీరం నుంచి ఎన్నికైన ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం,

నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (DNI) తులసి గబార్డ్,

మేరీల్యాండ్ రాష్ట్ర ఉప గవర్నర్ అరుణా మిల్లర్,

నెదర్లాండ్స్‌లో అమెరికన్ రాయబారి శెఫాలీ రాజదాన్ దుగ్గల్,

మెడికేర్ మరియు మెడికేడ్ సేవల కేంద్రాల నిర్వాహకురాలు సీమా వర్మ,

అమెరికన్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి,

న్యూజెర్సీ టౌన్‌షిప్ నుండి ఎన్నికైన కౌన్సిల్ డా.సుధాంశు ప్రసాద్

వీరంతా తమ పదవి ప్రమాణాన్ని భగవద్గీతపై చేయి వేసి పూర్తి చేశారు.

ఇక బ్రిటన్ విషయానికి వస్తే:

మాజీ ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి రిషి సునక్,

మాజీ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ,

లేబర్ పార్టీ ఎంపీ కనిష్క్ నారాయణ్,

లీసెస్టర్ ఈస్ట్ నుండి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ శివానీ రాజా

వంటి వారు గీతపై ప్రమాణం చేశారు.

అదేవిధంగా ఆస్ట్రేలియాలో పార్లమెంట్ సభ్యుడు వరుణ్ ఘోష్, ఆస్ట్రేలియన్ రాష్ట్రంలో కోశాధికారి డేనియల్ ముఖీ, విధాన సభ సభ్యుడు దీపక్ రాజ్ గుప్తా వంటి వారు భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు.

ఈ దేశాలతో పాటు, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా తమ పదవీ ప్రమాణం సమయంలో గీతను విశ్వసించారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు డా.రూడల్ మూనీలాల్ మరియు డా.రిషాద్ సీచరన్, అటార్నీ జనరల్ ఆనంద్ రామోల్‌గన్ వంటి వారంతా గీతను చేతబూని తమ పదవి ప్రమాణాన్ని చేశారు.