News

జాతీయ పునరుజ్జీవన ప్రచారంలో పాల్గొందాం : మోహన్ భాగవత్

0views
దేశ భవిష్యత్తు బాధ్యత యువత భుజ స్కంధాలపై వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.మనకు ఇష్టమున్నా, లేకపోయినా.. తప్పనిసరిగా దేశ బాధ్యత యువకుల భుజస్కంధాలపై పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని సిలిగుడి లో యువ సమ్మేళనం జరిగింది. ఇందులో ముఖ్య వక్తగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు దేశ భవిష్యత్తును తమ భుజ స్కంధాలపై వేసుకోవాలని, లేదంటే కేవలం మన కుటుంబం కోసమే పని చేస్తే.. కేవలం కుటుంబం మాత్రమే క్షేమంగా వుంటుందని, దేశం బాగుండాలని అన్నారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా.. సమాజం మేల్కొంటొందని ఇది ఎప్పటి నుంచో నడుస్తోందన్నారు. హూణులు, కుషానులు, పఠాన్లు, చివరకు బ్రిటీష్ వారి నుంచి కూడా ఇదే జరిగిందని ఉదాహరించారు.
సమాజంలో పాతుకుపోయి, ప్రబలంగా వుండిపోయిన వివక్ష, సంకుచితమైన స్వార్థాన్ని తొలగించే లక్ష్యంతో సామాజిక సంస్కరణల స్రవంతి ప్రారంభమైందన్నారు. మనం ఎవరం? మన వారు ఎవరు? అన్న మూలాన్ని తెలుసుకోవడానికి, ప్రజలను జాగృతం చేయడానికి దయానంద సరస్వతీ, రామకృష్ణ పరమహంస, వివేకానందుల ప్రేరణతో మనల్ని మనం తెలుసుకోవడానికి పని ప్రారంభమైందన్నారు.
తన యుక్తవయసులో కూడా, ‘డాక్టర్ జీ’ నాగ్‌పూర్‌లోని ఒక పాఠశాలలో ‘వందేమాతరం’ ఉద్యమానికి నాయకత్వం వహించారని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. సావర్కర్, నేతాజీ, తిలక్ వంటి గొప్ప వ్యక్తుల మాదిరిగానే.. సమాజాన్ని మార్చకుండా జాతిని ఉద్ధరించడం సాధ్యం కాదని డాక్టర్జీ కూడా గ్రహించారని, సమాజాన్ని మార్చకుండా పనిచేస్తే అన్ని ప్రయత్నాలు వ్యర్థమేనని గ్రహించారన్నారు.
mohan ji2
వైద్య విద్యను అభ్యసించే నెపంతో, డాక్టర్ హెడ్గేవార్ అనుశీలన్ సమితితో సంబంధాన్ని ఏర్పరచుకుని, పశ్చిమ భారతదేశంలో కూడా విప్లవ ఉద్యమాన్ని విస్తరించారన్నారు. అసలు ఏ చట్టం ప్రకారం మమ్మల్ని పరిపాలిస్తున్నారని డాక్టర్జీ ఆంగ్లేయులను నిలదీశారని, అంత ధైర్యవంతులని అన్నారు.దేశ సమగ్రాభివృద్ధికి వ్యక్తి నిర్మాణం అన్న కార్యాన్ని డాక్టర్జీ ప్రారంభించారని తెలిపారు.
ప్రస్తుతం తాము హిందువులం కాము అని ఎవరైతే భావిస్తున్నారో… వారి పూర్వీకులు కూడా హిందూ వారసులేనని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. పూజా పద్ధతులు, ఆహారపు అలవాట్లు భిన్నంగా వున్నా.. మనమంతా ఒకే దేశం, ఒకే సంస్కృతిలో భాగమని స్పష్టం చేశారు. భారత్ పై భక్తి లేని వాడు హిందువే కాడని, అన్ని రకాల వైవిధ్యాలను గౌరవించే ప్రత్యేక సంప్రదాయమున్న సంస్కృతి మన హిందూ సంస్కృతి అని తెలిపారు.
ఆరెస్సెస్ స్వయంసేవకులు సమాజంలోని ప్రతి రంగంలోనూ పనిచేస్తూ, ముందుకు సాగుతున్నారని, భారత్ లోని ప్రతి వ్యక్తీ దేశం కోసం జీవించాలని, దేశం గురించి తెలుసుకోవాలని, దేశాన్ని గౌరవించాలన్నారు. సంఘ్ అనేది భారతీయ మహా పురుషుల ఆలోచనలను, అనుభవాల సారాంశాన్ని ఆచరణలో పెట్టే ప్రక్రియ అభివర్ణించారు.
mohan ji23
సంఘ్ కార్యంలోకి రావొచ్చని, దానిని క్షుణ్ణంగా పరిశీలించాని, అది నచ్చితే, సంఘ కార్యంలో భాగస్వాములు కావాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ‘‘రండి.. మనమందరమూ ఈ గొప్ప జాతీయ పునరుజ్జీవన ప్రచారంలో పాల్గొందాం’’ అని పిలుపునిచ్చారు.