News

లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు

6views

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తొలి చార్జ్‌షీట్‌ సోమవారం దాఖలుచేసింది. దారుణోదంతం జరిగిన దాదాపు 8 నెలలకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక బలమైన సాక్ష్యాధారాలతో సమగ్రస్థాయిలో ఎన్‌ఐఏ 1,597 పేజీల చార్జ్‌షీట్‌ను ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించింది.

పాక్‌లో ఉంటున్న ఉగ్ర హ్యాండర్‌ హబీబుల్లాహ్‌ మాలిక్‌ అలియాస్‌ సాజిద్‌ జాట్‌ను ప్రధాన కుట్రదారుగా ఎన్‌ఐఏ పేర్కొంది. పహల్గాం దాడికి వ్యూహరచన, ఉగ్రవాదులను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా భారత్‌లోకి పంపించడం, వారి రహస్య బస వంటివన్నీ జాట్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగాయని చార్జ్‌షీట్‌లో ఎన్‌ఐఏ వెల్లడించింది. మొత్తంగా రెండు ఉగ్ర సంస్థలు, ఆరుగురు ఉగ్రవాదులను చార్జ్‌షీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది.

పహల్గాం పరిధిలోని ప్రఖ్యాత బైసారన్‌ లోయలో ఏప్రిల్‌ 22న దాడికి పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, దాని అనుబంధ ‘ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌’ఉగ్రవాదులు ఏ విధంగా వ్యూహం పన్నారు? దాడికుట్రను ఏ విధంగా అమలుపరిచారు? సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దాడి చేశారు? దాడిలో పాక్‌ పాత్ర వంటి సమగ్ర అంశాలను అభియోగపత్రంలో ఎన్‌ఐఏ సవివరంగా ప్రస్తావించింది.

ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు సులేమాన్‌ షా, హబీబ్‌ తాహిర్‌ అకా జిబ్రాన్, హమ్జా అఫ్గానీల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఆపరేషన్‌ మహదేవ్‌ పేరిట చేపట్టిన గాలింపు చర్యలవేళ భద్రతాబలగాలు ఈ ముగ్గురిని అంతమొందించడం తెల్సిందే. ఉగ్రవాదులకు స్థానిక బస, ఆహారం, రవాణా సదుపాయాలు కల్పిచిన పర్వేజ్‌ అహ్మద్, బషీర్‌ అహ్మద్‌ల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. భారతీయ న్యాయసంహిత, ఆయుధాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం 2 ఉగ్రసంస్థలు, పలువురు ఉగ్రవాదుల చార్జ్‌షీట్‌ వేశారు. ఏప్రిల్‌ 22నాటి అమానవీయ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.