News

బృందావన్‌ ఆలయంలో దర్శన వేళల మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులు

38views

శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం బృందావన్‌లోని బాంకె బిహారీ జీ (రాధాకృష్ణ) ఆలయంలో దర్శన వేళల్లో, పూజా క్రతువుల్లో మార్పులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పాలకమండలికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే దెహ్రీ పూజ,  ఇతర క్రతువులను నిలిపివేశారని పిటిషనర్‌ తెలిపారు. ఆలయంలో అత్యంత నిష్ఠగా పాటించే దర్శన వేళలనూ మార్చివేయడంతో పాటు దేవుళ్ల విశ్రాంతి, నిద్ర, మేల్కొలుపు ఆరాధనల్లోనూ కొత్త విధానాలు వచ్చి చేరాయని ఆరోపించారు.

‘ఇండిగో’ పిటిషన్‌ తిరస్కరణ
వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దైన వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇబ్బందులేమైనా ఉంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ నరేంద్ర మిశ్రకు సూచించింది. ఇలాంటి పిటిషన్‌ ఒకటి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ముందు ఉందని, పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) నిపుణుల కమిటీని నియమించిందని ఇండిగో తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు.

  • పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా పడింది. జాతీయ భద్రతా చట్టం కింద సెప్టెంబరు 26న పోలీసులు వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు.