News

యానాం చేరుకున్న గోదావరి పరిక్రమ యాత్ర

30views

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గోదావరి నది తీరాలలో ఈ ఏడాది అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అదే గోదావరి పరిక్రమణ ప్రదక్షిణ. లోకకళ్యాణార్థం, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా వందలాది మంది సాధువులు బోట్ల ద్వారా ఈ నదీ ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.

ఈ మహా కార్యక్రమం డిసెంబర్ 6వ తేదీన గోదావరి జన్మస్థానమైన నాసిక్ త్రయంబకం నుంచి ప్రారంభమై, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలకు చేరుకుంది. దేశంలోని దాదాపు 300 మంది సాధువులు, సత్పురుషులు మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ప్రారంభమైన గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) యాత్ర యానాం చేరుకుంది. ఉత్తరప్రదేశ్ మధుర పీఠాధిపతి జగద్గురు అగ్రమలోక్, పీఠాధిస్వర్ స్వామి శ్రీ రాజేంద్ర దాస్, దేవా చారి జీ మహారాజ్ వంటి మహానుభావుల పర్యవేక్షణలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్‌ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నాసిక్‌ వద్ద ప్రారంభమైన యాత్ర కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం మీదుగా సాగింది. శనివారం తెల్లవారు జామున యానాం నుంచి బయలుదేరి అంతర్వేది చేరుకుంటామని వారు తెలిపారు. అక్కడి నుంచి నాసిక్‌కు తిరిగి వెళ్తామని వివరించారు.

మహా సాధువులు ఈ పరిక్రమణ ఉద్దేశాన్ని వివరిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణ, గోమాత రక్షణ, హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. నాలుగు రాష్ట్రాలకు పైగా విస్తరించి ఉన్న గోదావరి నదిపై ప్రత్యేకంగా అలంకరించిన సుమారు పది బోట్ల ద్వారా ఈ ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. గోదావరి పుట్టిన నాసిక్ నుంచి మొదలైన ఈ జలయాత్ర, నదీ పరీవాహక ప్రాంతంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కలుపుతూ కొనసాగుతోంది.