
గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్ హెల్త్‌కేర్’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు అధ్యక్షతన సత్యసాయి సేవా సంస్థల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ హెల్త్ కేర్ వాహనం ద్వారా నెలకు ఒకటి రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తామన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ తదితర వ్యాధులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సూత్రాలు వివరించి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని సాయిగణేష్ మందిరంలో ఇప్పటికే సత్యసాయి ఆశ్రిత సేవ ప్రారంభించి విద్యావంతులైన గ్రామీణ యువకులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తూ ఉద్యోగం సాధించే వరకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
సత్యసాయి సేవా రథం ద్వారా రానున్న ఐదేళ్లలో 1000 గ్రామాలలో సత్య సాయి భజన మండళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. కమలా త్రివేణి మాట్లాడుత సత్య సాయి 100వ పుట్టినరోజు వేడుకల్లో మహిళల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద మందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ, జిల్లా, జోనల్ పదాధికారులు, కన్వీనర్లు, బాల వికాస్ గురువులు, యువత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





