News

పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు

30views

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మకమైన భౌగోళిక గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టులో చేశారు. ‘‘శ్రీకాకుళం వాసిగా ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జీఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉంది.

ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు.. శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి ప్రియమైన పొందూరు ఖాదీ.. ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును తెచ్చాయి. ఈ జీఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. జీఐ ట్యాగ్.. వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది, జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది’’ అని రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

పొందూరు ఖద్దర్‌ చరిత్ర ఇదీ..
స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. అందుకు తన కుమారుడు దేవ్‌దాస్‌ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవ్‌దాస్‌ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేకమంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం. 1955లో ఆచార్య వినోభాబావే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది.