
సమాజంలోని విభిన్న క్షేత్రాల్లో ఆరెస్సెస్ స్వయంసేవకులు నిస్వార్థంగా సేవ చేస్తూ, తమ వంతు కృషి చేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. గత వంద సంవత్సరాలుగా సంఘ్ నిత్య శాఖ, సేవా కార్యకలాపాలు, విద్యా, సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నించిందని తెలిపారు. ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా జమ్మూలోని కెనాల్ రోడ్డులో ‘‘సంఘ వందేళ్ల ప్రయాణం, భవిష్యత్తు దిశ’’ పేరుతో మేధావుల సదస్సు జరిగింది. దీనికి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తాషి రబస్తాన్ ముఖ్య అతిథిగా, సర్ కార్యవాహ హోసబళే ముఖ్య వక్తగా హాజరయ్యారు. అలాగే సమాజంలోని అనేక రంగాలకు చెందిన ముఖ్యులు హాజరయ్యారు.
బలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన, సాంస్కృతిక అవగాహన కలిగిన, సంఘటితమైన భారత్ ను నిర్మించడమే సంఘ్ ప్రధాన ఉద్దేశ్యమని హోసబళే పునరుద్ఘాటించారు. సామాజిక జీవితంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు ప్రచారానికి దూరంగా వుంటూ, నిశ్శబ్దంగా, నిస్వార్థంగా తమ సహకారాన్ని అందిస్తూనే వున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక సేవ, సామాజిక సామరస్యం, అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా, సమాజాన్ని ఏకం చేయడంలో మరింత మంది యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ, సమాజ ఆధారిత జీవన విలువలను బలోపేతం చేయడం, జాతి నిర్మాణంలో ప్రతి పౌరుడూ చురుకుగా పాల్గోనాలని కూడా సూచించారు.
సంఘ కార్య శతాబ్ది అనేది చివరి మజిలీ ఏమీ కాదని, అయితే సంఘ్ ప్రయాణంలో మాత్రం ఓ మైలురాయి అని అభివర్నించారు. ఆ తర్వాత సమాజం, దేశం కోసం మరింత అంకిత భావంతో ముందుకు సాగాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.




