
సంస్కృతం ద్వారా సంస్కృతిని వ్యాప్తి చేసిన ఘనత ఆచార్య రవ్వా శ్రీహరిదే అని ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
సంస్కృత పండితుడు, కొవ్వూరు ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డా.దోర్బల ప్రభాకరశర్మ, తెలుగు భాషా సాహిత్య పరిశోధకుడు డా.గుంజి వెంకటరత్నంలకు ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయడంతో పాటు నగదు బహుమతి అందజేశారు. తెలుగు అకాడమీ పూర్వ సంచాలకుడు ప్రొఫెసర్ కె.యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కసిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ భాషలకు కీలకమైన వ్యాకరణ, ఛందస్సు శాస్త్రాలను అధ్యయనం చేసిన మహానుభావుడు రవ్వా శ్రీహరి అని కొనియాడారు.
విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు డా.కొండలరావు వెల్చాల మాట్లాడుతూ… రవ్వా శ్రీహరిని రుషిగా అభివర్ణించారు. సంస్కృత అధ్యయనంలో ప్రతిభ కనబరచిన 10 మంది విద్యార్థులకు యువ సంస్కృత ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రొ.పిల్లలమర్రి రాములు, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య శలాక రఘునాథశర్మ, డా.శ్రీరంగాచార్య, రవ్వా రమేశ్ తదితరులు ప్రసంగించారు.





