News

దేశీయ కథన నిర్మాణాలే ఇప్పుడు కావాల్సింది : సునీల్ అంబేకర్

164views

దేశ వ్యతిరేకులు ప్రారంభించిన కథన నిర్మాణం (narrative building) కేవలం సైద్ధాంతిక రంగానికే పరిమితం కాలేదని, భౌతిక రంగంలోకి కూడా వ్యాపించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు. దీని ఫలితంగానే దేశ వ్యాప్తంగా, ఇతర దేశాల్లోనూ రక్తపాతం జరిగిందని, దీనికి శ్రీలంకతో పాటు మరికొన్ని పొరుగు దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనలే ఉదాహరణ అని ఉటంకించారు.

ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీలోని కేశవ కుంజ్ లో మీడియా ప్లాట్ ఫారమ్ DesiNarrative.com ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. దేశ వ్యతిరేకులు నకిలీ కథన నిర్మాణాలతో యుద్ధాలు చేస్తున్న ఈ యుగంలో, దేశీ కథనం (desi narrative) వంటివి చాలా అవసరమని, దీని అవసరం కేవలం కేరళ, తమిళనాడుకే కాకుండా దేశానికే అవసరం అని నొక్కి చెప్పారు. దేశ వ్యతిరేక కథనాలను, వాస్తవాలు, అసలైన పరిశోధనలతో ఎదుర్కోవడం అత్యవసరం అని అన్నారు. దీని పేరులోనే అంతా వుందని, దేశీ కథనం ఆ దిశలో దోహదపడుతుందని, నిజమైన దేశీ కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహాయపడుతుందని తాను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వేదిక యువతను సాంస్కృతిక, చారిత్రక మూలాలతో అనుసంధానం అవ్వడానికి సహాయపడుతుందని, దీని మేరకు అవసరమైన కంటెంట్ ను, కథనాలను అందించాలని కూడా నిపుణులను ఆహ్వానించారు. DesiNarrative.com అనేది వార్తలు మరియు ఆలోచనలపై ఆలోచనాత్మకమైన, చారిత్రాత్మకంగా ఆధారపడిన మరియు సందర్భోచిత దృక్పథాలను అందించే అనేక రకాల భాషల మీడియా వేదిక అని వెల్లడించారు.

ఇక.,. DesiNarrative.com ప్రతినిధి డాక్టర్ పి. సందీప్ కుమార్ కూడా మాట్లాడారు. తాము ముఖ్యాంశాలకు మించి, ప్రస్తుత సంఘటనలు, సాంస్కృతిక చర్చలు, లోతైన సైద్ధాంతిక విషయాలపై లోతైన దృష్టికోణం అందించాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. కేవలం సంఘటనలను నివేదించడమే కాకుండా, ప్రేక్షకులకు లోతైన స్పష్టత, సైద్ధాంతిక విషయాలలో సరైన అవగాహనను కల్పిస్తామని అన్నారు.