
ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఒడుదొడుకులు కొనసాగుతున్నా.. భారత్- రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు.హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో జైశంకర్ మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యాతో బంధం కారణంగానే అమెరికా- భారత్‌ల వాణిజ్య ఒప్పందం మరింత క్లిష్టంగా మారిందా? అని విలేకరి ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి బదులిస్తూ.. ‘వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారాన్ని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకం. ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. గత 70-80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, భారత్-రష్యాల మధ్య బంధం స్థిరంగా కొనసాగుతుంది’ అని అన్నారు. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదు అని వ్యాఖ్యానించారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే ఓ ఒప్పందం కూడా జరుగుతుందన్నారు. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే ఇది ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
పాక్ ఆర్మీ నుంచే మనకు సమస్యలు
ఇక, ఈ కార్యక్రమంలో పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి ప్రశ్న ఎదురయ్యింది. దీనికి జైశంకర్ బదులిస్తూ.. పాక్ సైన్యంపై విమర్శలు గుప్పించారు. దాని నిజస్వరూపం మనకు తెలుసని.. దానివల్లే మన దేశానికి సమస్యలు వచ్చి పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో శాంతి కోసం భారత్- చైనా సంబంధాలు కీలకమన్నారు. ఇటీవల ఇరుదేశాల సంబంధాలు బలపడిన విషయాన్ని ప్రస్తావించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్వదేశంలో మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. హసీనా అప్పగింతపై ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ఉండటం ఆమె వ్యక్తిగత విషయమన్నారు.





