ArticlesNews

సామాజిక సమరసత

65views

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చేస్తున్న పని వ్యక్తి నిర్మాణం. నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన. సంఘ శాఖ, సాప్తాహిక్‌, సంఘమండలి ద్వారానేకాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచపరివర్తన్‌ అనే కార్యక్రమాన్ని సంఘం తీసుకుంది. ‘‘సమాజము, సంఘము కలిపోయే స్థితిని సంఘం కోరుకుంటు న్నది. సమాజంలో విడిగా ఒక సంఘటనను నిర్మించడం సంఘ ఉద్దేశ్యం కాదు.

ఇపుడు మనం సంఘ శతజయంతి సంవత్స రంలో ఉన్నాం. ద్విశతి, త్రిశతి జయంతి జరుపుకోవాలని కోరుకోవడం లేదు’’ అంటారు పూజ్య సర్‌సంఘచాలక్‌జీ మోహన్‌ భాగవత్‌. కనుక పంచపరివర్తన్‌ కార్యక్రమాల ద్వారా సమాజంలో పరివర్తన తేవాలన్నది సంఘ ఉద్దేశ్యం. ఆ రకంగా సంఘ సిద్ధాంతం ఎక్కువ మందికి చేరాలన్నది సంఘం ఆలోచన.

ఇందులో మొదటిది సామాజిక సమరసత. మన సమాజంలో ఎంతో వైవిధ్యం ఉంది. వివిధత ఉంది. ఎన్నో కులాలున్నాయి. కులాలెన్ని ఉన్నా అందరం హిందువులం బంధువులం అనే భావ జాగరణ జరగాలి. కుల నిర్మూలన లేదు, కుల నిర్మాణం లేదు, అందరం హిందువులం అనే భావన తీసుకురావాలి. సంఘ స్థాపనకు, సంఘ స్థాపకులు తీసుకున్న మూల మంత్రం హిందూ సంఘటన. కనుక మనలో ఎన్ని కులాలున్నా మనం హిందువులుగా కలిసిఉండాలి. కలిసిఉంటే నిలబడతాం. చీలిపోతే కూలిపోతాం, విడిపోతే పడిపోతాం.

డాక్టర్జీ 1934లో వార్ధాశిబిరంలో ఉన్నారు. ఆ శిబిరం సమీపంలో గాంధీగారి ఆశ్రమం ఉంది. గాంధిజీ కూడా అక్కడ ఉన్నారు. ‘పక్కనే ఏదో జరుగుతుంది, అంతా యూనిఫాంలో ఉన్నారు, ఒకసారి చూసివద్దాం’ అని గాంధీజీ శిబిరం వద్దకు వచ్చారు. ‘ఏం జరుగుతోంది’ అని శిబిర నిర్వహ కుల్ని అడిగారు. ‘సంఘం హిందూ సంఘటన కార్యం చేస్తోంది. అందులో భాగంగా ఒక శిబిరం జరుగుతోంది’ అన్నారు. ‘ఇందులో హరిజను లున్నారా’ అని అడిగారు గాంధీజీ. ‘సంఘం ఈ విషయమై ప్రత్యేకంగా ఎవరినీ అడగదు, మీరు కావాలంటే శిబిరంలోకి వెళ్లి స్వయంసేవకులను అడగవచ్చు’ అన్నారు. అంతా కలిసి భోజనం చేస్తున్నారు, కలసి అడుతున్నారు, కలిసిపాడుతు న్నారు, కలిసి శారీరక్‌ చేస్తున్నారు, మరి ఇందులో హరిజనులున్నారా అని గాంధీగారికి అనుమానం వచ్చింది. ఆయన కొంతమందిని పిలిచి అడిగారు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. తాను చేస్తున్న పని, హరిజనోద్యమం పని సంఘం అప్పటికే చేస్తోంది అని ఆయనకు అనిపించింది. కనుక అందరం హిందువులం, భరమాత సంతానం, అని సంఘం చెబుతుంది.

‘పూచే పూవుకు కులముందా? విచేగాలికి కులముందా?/ పారే నీటికి కులముందా? పండే చేనుకు కులముందా?

హిందు ధర్మం అందరిది, అంటదానిదనుట నేరమది / ధర్మగంగలో స్నానం చేద్దాం మనసున మలినం తొలగిద్దాం’

అంటూ సంఘం సామాజిక సమరసత సందేశాన్ని ఇవ్వాలని సంకల్పించింది. ఈ పనిలో చాలా పురోగతి సాధించింది. దేశంలో అనేక మతాలున్నాయి. కొన్ని పరాయి మతాలు పరమత పీడ చేయడం, అంటే మత మార్పిడులు చేయడంల్ల మన హిందువుల సంఖ్య తగ్గిపోతున్నది. వెనుకబడ్డ సోదరులను మనం ఆదరించాలి. వారికి విద్య, వైద్యం అందించాలి, వారికి కూడా సమాజంలో గౌరవం లభించేలా చేయాలి. వారు కూడా సమాజజీవన స్రవంతిలో భాగస్వాములు కావాలి. అందుకోసమే సామాజిక సమరసత అనే వేదిక ఏర్పడిరది. ప్రతిగామంలో అందరికీ ఒకే బావి, ఒకే స్మశానం, ఒకే గుడి అనే పద్ధతిలో సంఘ స్వయంసేవకులు ఉద్యమిస్తున్నారు.