
వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఆ మేరకు ఉన్నత స్థాయిలో ఆమోద ముద్ర వేశారు. తితిదేకి అధికారికంగా ఉత్తర్వులు అందగానే మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
సీఎం ఆదేశాలతో కదలిక
సందర్శకుల అభ్యర్థనల మేరకు 2023 జనవరి 1 నుంచి అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. తొలుత పెరుగన్నం, సాంబారన్నానికి అనుమతిచ్చారు. అనంతరం తెల్లన్నం, తాలింపు, పచ్చడి, సాంబారు, రసం, మజ్జిగతో భోజనం పెడుతున్నారు. అదికూడా మధ్యాహ్నం 11.30- 2 గంటల వరకే అమలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల తరహాలో ఇక్కడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతికి తితిదే మే 20న సమ్మతించింది. యంత్ర పరికరాలు, సామగ్రి, సరకుల కొనుగోలుకు రూ. 4.35 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
అనుమతిచ్చిన పురావస్తు శాఖ
రామయ్య క్షేత్రం ప్రాచీన కట్టడం కావడంతో కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. ఆలయానికి 300 మీటర్లలోపు ఎలాంటి పనులు చేయాలన్నా ఆ శాఖ నుంచి అనుమతి అవసరం. ఈ మేరకు తితిదే నుంచి ప్రతిపాదనలు పంపించారు. దిల్లీలో ఇటీవల ఉన్నతాధికారులు చర్చించి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవడానికి సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే పనులకు శ్రీకారం చుట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకేసారి 200-250 మంది కూర్చునేలా 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో జర్మన్ షెడ్డు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.





