News

రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

31views

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే “జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని” రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకొని ఏటా లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రిగా తాను, సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి వేర్వేరు సందర్భాల్లో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రభల తీర్థాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం వెంటనే సమ్మతించారని స్పష్టం చేశారు.

ప్రతి ఏటా కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారన్నారు. ఎన్నో తరాల నుండి సంప్రదాయంగా వస్తోన్న ఈ ప్రభల తీర్థం జరిగే సమయంలో పండుగ వాతావరణం నెలకొని అధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందన్నారు. వీటన్నింటితో పాటు కోనసీమ వాసుల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఏకాదశ రుద్రులతో పాటు వివిధ రూపాలతో తీసుకువచ్చే జగ్గన్నతోట ప్రభల తీర్థ అద్భుత ఘట్టాన్ని అందరం కలిసి ఘనంగా నిర్వహించుకుందామని, అదే విధంగా ప్రపంచానికి చాటి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.