News

3, 4, 5 తేదీల్లో జాతీయ గిరిజన విద్యార్థుల సాంస్కృతికోత్సవాలు

40views

రాష్ట్రంలో డిసెంబరు 3, 4, 5 తేదీల్లో 6వ జాతీయ ఏకలవ్య గురుకుల విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 1,800 మంది గిరిజన విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 110 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను గిరిజన గురుకులాల కార్యదర్శి గౌతమి, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ సదాభార్గవితో కలసి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్భవ్‌-2025గా నామకరణం చేసిందని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి సమీపంలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం వేదికగా వీటిని నిర్వహిస్తామన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.500 కోట్లు
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా అన్ని గ్రామాలకు అనుసంధాన రహదారులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటివరకు మౌలిక వసతుల కల్పనకు రూ.1,300 కోట్లు కేటాయించామని, దశల వారీగా అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.1,000 కోట్లు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.500 కోట్లు ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆమోదించారని పేర్కొన్నారు.