News

వైకుంఠద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్దపీట : టిటిడి ఛైర్మన్‌

41views

తిరుమలలో డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 10 రోజుల్లో 7 రోజులు టోకెన్లు లేకుండా అనుమతి ఉంటుందన్నారు. తొలి 3 రోజులు మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి దర్శనం కల్పిస్తామని తెలిపారు. మిగిలిన ఏడు రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు.

‘‘జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పిస్తాం. రోజుకు 1000 శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. పది రోజులు ప్రత్యేక, వీఐపీ బ్రేక్‌, చంటి పిల్లల దర్శనాలు రద్దు చేశాం. డిసెంబర్ పదో తేదీన స్థానికుల దర్శన కోటా విడుదల చేయనున్నాం. తిరుపతి, తిరుమల, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 5 వేల టోకెన్లు అందజేస్తాం. డిసెంబర్ ఐదో తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన కోటా, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 దర్శన కోటా విడుదల చేస్తాం’’ అని బీఆర్‌ నాయుడు అన్నారు.