
సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్ బహాదుర్ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ప్రసంగించి, నివాళులు అర్పించారు. ప్రత్యేక నాణేన్ని, తపాలా బిళ్లను విడుదల చేశారు. తమ ప్రభుత్వం గురు పరంపరను గౌరవిస్తుందన్నారు.
తేగ్ బహాదుర్ జీవితం, త్యాగచరిత్ర, గుణగణాలు మనకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. అలాంటివారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారన్నారు. ఆయన బోధనలు మన ప్రవర్తనలో శాంతికి పునాది కావాలని, విధానాల్లో సమతౌల్యానికి దోహదపడాలని ఆకాంక్షించారు. తమను మొగల్ పాలకులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చాలని చూస్తున్నారని, ఆదుకోవాలని కశ్మీర్‌లోని హిందువులు కోరినప్పుడు.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు ఎదురొడ్డి నిలబడి తేగ్ బహాదుర్ తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తుచేశారు. విశ్వాసాలు, సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, ధర్మపథాన్ని వీడకుండా ఆయన జీవితాంతం పోరాడారని చెప్పారు. అయోధ్య రామ మందిరంపై 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు తాను పంజాబ్‌లో కర్తార్‌పుర్ నడవాను ప్రారంభిస్తున్నానని గుర్తుచేసుకున్నారు. కురుక్షేత్రలో కృష్ణ భగవానుని శంఖువుకు అంకితమిస్తూ కొత్తగా నిర్మించిన పాంచజన్య స్మారకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మహాభారత అనుభవ్ కేంద్రాన్ని సందర్శించారు.





