News

తల్లిదండ్రులను దేవతల స్థానంలో కొలవడం భారతీయ సంస్కృతిలో భాగం

145views

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల జీవితాలు ధన్యం.

నాన్నంటే ఆకాశం. అమ్మంటే భూమి. ఆ రెండింటి మధ్య అనంత సృష్టి రహస్యాలకు వారధులు పిల్లలు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారిపట్ల బాధ్యతగా ఉండటం బిడ్డల ధర్మం. అమ్మానాన్నల మాట పెడచెవిన పెట్టిన రావణుడి అంతిమ ఘడియలు ఎటువంటివో రామాయణ మహాకావ్యం చెబుతుంది. గీతామృత ప్రదాత శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు తండ్రి మాటను వ్యతిరేకించడం వల్ల యాదవ వంశానికి ముప్పు వాటిల్లింది. జైన గ్రంథాలలో కూడా కన్నవారి మాట వినని పిల్లల పనుల పర్యవసానాలు ఎలా ఉంటాయో విశదంగా చెప్పారు. తల్లిదండ్రులను దేవతల స్థానంలో ఉంచి కొలవడం భారతీయ సంస్కృతిలో భాగం. వారి పట్ల కృతజ్ఞతతో కూడిన సేవను ‘పుత్రధర్మం’గా భావిస్తారు. ఈ ధర్మాన్ని నిర్వర్తించడం బాధ్యత మాత్రమే కాదు. అదో ఆధ్యాత్మిక సాధన. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు అన్నీ ఈ విషయాన్ని చెబుతాయి.

తైత్తిరీయ ఉపనిషత్తులోని ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ’ అనే వాక్యం అర్థం చేసుకునే స్థాయిని మించి అనుభవించే స్థాయిలో ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమగా వ్యవహరించడం సంతానం కర్తవ్యం. దాన్ని సదా గుర్తుచేసేందుకే మనుస్మృతిలో, గౌతమ ధర్మసూత్రాల్లో, భరత, భీష్మ వంటి మహానుభావుల ఉపదేశాల్లో తల్లిదండ్రుల సేవకు అత్యున్నత స్థానం ఇచ్చారు. అలా సేవ చేసిన శ్రవణ కుమారుణ్ని ఎప్పటికీ మరచిపోలేం. ఇది కేవలం కర్తవ్య నిబద్ధత కాదు, భక్తి సంపత్తి. భారతంలో భీష్ముడు తల్లి గంగకు విధేయత చూపిన విధానం కూడా పుత్రధర్మానికి ప్రత్యక్ష ఉదాహరణ.

ఆధ్యాత్మికంగా చూస్తే, మాతృమూర్తి శక్తి స్వరూపిణి. తల్లి ప్రేమలో దయ కనిపిస్తుంది. తండ్రి దండనలో బాధ్యత ఉంటుంది. ఈ ఇద్దరిలో భగవద్గుణాలు ప్రతిఫలిస్తాయి. వారికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసిన ఫలితం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు లేకుండా గురువు, దేవతల అనుగ్రహాన్ని పొందలేం. వారి ఆశీర్వాదమే సద్గతి దిశగా నడిపించే దీపం. తల్లిదండ్రులను సేవించడమంటే కేవలం భౌతిక అవసరాలు తీర్చడం కాదు. మానసికంగానూ చేరువవ్వాలి. ఒంటరితనాన్ని దూరం చేయాలి. వృద్ధాప్యంలో వారు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ సాంత్వననివ్వగలిగితే… అదే నిజమైన పుత్రధర్మం. దీన్ని ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. జీవితాంతం కొనసాగించాలి. ఆ సేవలో కన్నవారి రుణం తీర్చుకునే భాగ్యమే కాదు, మన సొంత ఆత్మనెరిగే మార్గం కూడా దాగి ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మన జీవితానికి లోకోత్తరమైన అర్థాన్ని అందిస్తుంది. పారమార్థిక జీవితానికి దారిచూపుతుంది.