
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్ పార్కు సిద్ధమవుతూ ఉంది. మతపరమైన మరియు సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రధాన చొరవలో భాగంగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భగవాన్ రాముడి పవిత్ర జన్మస్థలమైన అయోధ్యలో ఒక గొప్ప రామాయణ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ భారీ రావణాసురుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 25 అడుగుల రావణాసురుడి విగ్రహం ఇక్కడ ఉండనుంది. పురాణ కాలంలో రామ, రావణుల మధ్య జరిగిన యుద్ధాన్ని తలపించేలా ఈ విగ్రహం ఉండనుంది. 25 అడుగుల రావణుడి విగ్రహం రామాయణంలోని పతాక యుద్ధ దృశ్యాన్ని ప్రదర్శించే పెద్ద శకటంలో భాగంగా ఉంటుంది. ఈ కేంద్ర భాగం చుట్టూ భగవాన్ రాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు , అంగదుడి విగ్రహాలు ఉంటాయి, గుప్తార్ ఘాట్‌కు సమీపంలో తీర్చిదిద్దుతున్న ఈ పార్కులో రామాయణంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టేలా పలు భారీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు అయోధ్య మేయర్ తెలిపారు. సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలతో రూపొందిస్తున్న ‘రామ్‌దర్బార్’ అద్భుత ఆకర్షణగా నిలవనుంది.





