News

సంఘ్ ప్రత్యేకంగా ఏమీ చేయదు.. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంతే : మోహన్ భాగవత్

16views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లక్ష్యం సుస్పష్టంగానే వుందని, యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేయడం అలాగే మంచి ఉద్దేశాలతో కూడిన బలమైన సమాజాన్ని నిర్మాణం చేయడం అని ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఇలా సంఘటితమైన హిందూ సమాజం ధార్మికమైన జ్ఞానం ద్వారా ప్రపంచానికి శాంతి, ఆనందాన్ని తీసుకురావాలన్నదే తమ ఏకైక దృష్టి అని తెలిపారు. వీటన్నింటినీ సాధించిన తర్వాత సంఘ్ కి ఇతర లక్ష్యాలేవీ లేవని, మిగిలిన విషయాల్ని వ్యవస్థీకృత సమాజమే చూసుకుంటుందన్నారు.

“100 ఏళ్ళ సంఘ్ యాత్ర: కొత్త ఆశయాలు” (100 Years of Sangh Journey: New Horisons) అంశంపై వ్యాఖ్యానమాల పేరిట బెంగళూరులో 2 రోజుల ఉపన్యాస శ్రేణి ప్రారంభమైంది. రెండో రోజులో భాగంగా ఆదివారం సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను అడిగారు.

1. ఆరెస్సెస్ లోకి ముస్లింలకు ప్రవేశం వుంటుందా? మైనారిటీల్లో సంఘ్ ఎలా విశ్వాసాన్ని నింపుతుంది?మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏమైనా విద్యాలయాలు నడుపుతారా?
బ్రాహ్మణులెవ్వర్నీ సంఘ్ లోకి అనుమతించం.మరే ఇతర కులాలకూ సంఘ్ లోకి అనుమతి లేదు. అలాగే ముస్లిం, క్రిస్టియన్ కూడా. శైవులు, శాక్తేయులను కూడా. కేవలం హిందువులకు మాత్రమే సంఘ్ లోకి అనుమతి. ఇలా ఎలాంటి ప్రత్యేక గుర్తింపులతో సంఘ్ కి వచ్చినా.. వాటన్నింటినీ, ప్రత్యేకతలన్నింటినీ బయటే వదిలి రావాలి. అయితే.. వారి వారి ప్రత్యేకతలనేవి ఎప్పటికీ స్వాగతించదగ్గవే.కానీ ఎప్పుడైతే సంఘ శాఖలోకి వస్తున్నారో ఓ భారత మాత పుత్రునిగా మాత్రమే రావాలి. హిందూ సమాజంలోని ఓ సభ్యునిగా మాత్రమే రావాలి. కాబట్టి ముస్లింలు, క్రిస్టియన్లు శాఖకి రావొచ్చు. అలాగే హిందూ సమాజంలో ఏవైతే వర్గాలంటున్నామో… వారందరూ సంఘ శాఖకి రావొచ్చు. అయితే ఎవ్వర్ని కూడా మీరెవరు అని అడగం. మనమందరమూ భారత మాత పుత్రులమే. దీని ఆధారంగానే సంఘ్ పనిచేస్తుంది.

అలాగే సమాజం దూరంగా వుంచిన కొందర్ని ప్రత్యేకంగా కలుస్తాం. కాబట్టి అదే వారిని చేరుకోవడానికి చేసే కార్యక్రమం. ప్రత్యేకంగా చేరుకోవడానికి కార్యక్రమాలంటూ వుండవు. సంఘం ఎవరికి కోసం ఏమీ చేయదు. ఎవరికి వారు వారి సొంత పనిని చేసుకోవాల్సిందే. అలాగే తమని తామే ఉద్ధరించుకోవాలి కూడా. (ఆత్మోద్ధరణ). ఎవరూ ప్రత్యేకంగా ఏమీ చేయరు.ఎవరికి వారే ఉద్ధరించుకునే పనిలో వుంటారో వారికే ఈశ్వరుడు కూడా సహాయపడుతుంటాడు.కానీ అలా కావడానికి సంఘ్ తగిన తోడ్పాటునిస్తుంది. వ్యక్తులను అలా తయారుచేస్తుంది. కాబట్టి సంఘ్ నుంచి ఎలాంటివి ఆపేక్షించొద్దు. ఆశించొద్దు. సంఘ్ లోకి వచ్చిన తర్వాత ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించొద్దు. మన పని మనమే చేసుకోవాలి. ఇదే సంఘ్ లో బోధిస్తాం. కొందరు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి సహాయం మాత్రం చేస్తుంటాం. అంతేకానీ ముస్లిం కోసం ప్రత్యేక పాఠశాలలు, క్రిస్టియన్ల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రాహ్మణుల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రాహ్మణేతరులకు ప్రత్యేక పాఠశాలలు.. ఇలాంటివి సంఘ్ చేయదు.

శాఖను నడపడం, వ్యక్తి నిర్మాణమే సంఘ్ చేసే పని. అయితే స్వయంసేవకులకు వివిధ రకాలైన సంస్థలుంటాయి, అవన్నీ పూర్తి స్వంతంత్రమైనవిగా పనిచేస్తుంటాయి. ఎవ్వరిపై ఆధారపడకుండా, స్వతంత్రగా ఎదగాలని ఆశిస్తాం. దీంతో బయటి సమాజం నుంచి కానీ, సంఘ్ నుంచి గానీ ఏమీ ఆశించకుండా వుండేందుకు వీలు కుదురుతుంది. వారందరూ ఇదే పనులు చేస్తుంటారు. ఎవరైతే ఆత్మోద్ధరణ చేసుకుంటారో వారికి దేవుడు సహాయపడుతుంటాడు కదా. ఇదే సిద్ధాంతంపై పనిచేస్తుంటాయి. ముస్లింలు నివసించే ప్రాంతాల్లో శ్రీ సరస్వతీ శిశు మందిరాలు కూడా వున్నాయి. వాటిని విద్యా భారతి నడుపుతుంటుంది. అంతేగానీ అవుట్ రీచ్ కార్యక్రమాలేవీ వుండవు. సంఘ్ లోకి రావాలి. ఉన్నదంతా ఇచ్చేయాలి. భారతమాత చరణాల ముందు సమర్పణ చేయాలి. సంఘ్ ఏమీ ఇవ్వదు. అన్నింటినీ సమర్పించమని అడుగుతుంది.

2. సంఘ్ ఎందుకు రిజిస్టర్డ్ సంస్థ కాదు? ఇది యాదృచ్ఛికమా? లేదా ఎంపికనా? లేదా సమస్యలను నివారించడానికా?

దీనికి మోహన్ భాగవత్ సమాధానమిస్తూ.. ‘‘సంఘ్ 1925 సంవత్సరంలో స్థాపించబడింది. ఆ సమయంలో మేము బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మరి వారి ప్రభుత్వం దగ్గరికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవడం ఎలా సాధ్యం? స్వాతంత్రం తర్వాత కూడా భారత్ లో రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ తప్పనిసరేం కాదు. అయినా చట్టబద్ధ సంస్థే. చట్టం ప్రకారం ఈ సంస్థ వ్యక్తుల సమూహం అన్న వర్గంలోకి వస్తుంది. ఆదాయపు పన్ను విధించినప్పుడు కోర్టు ‘‘గురుదక్షిణ’’ను పన్ను రహితంగా ప్రకటించింది. ప్రభుత్వం సంఘ్ ను మూడు సార్లు నిషేధించినప్పటికీ, కోర్టు ప్రతిసారీ దానిని తోసిపుచ్చింది. దీంతో సంఘ్ చట్టబద్థ సంస్థగా గుర్తింపు పొందినట్లే కదా’’ అని మోహన్ భాగవత్ తెలిపారు.