News

వందేమాతరంపై వివాదం

34views

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సాగిన చారిత్రక స్వాతంత్య్ర సంగ్రామ వ్యాప్తికి తారకమంత్రంలా పనిచేసిన వందేమాతర గేయం రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాద భావజాలానికి అనుగుణంగానే ఉందా? ఈ గేయం.. ఏ మత వర్గానికైనా వ్యతిరేకమా..? అన్న వివాదం ప్రతి కొన్నేళ్లకొకసారి తలెత్తుతూనే ఉంది. ఈ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. ‘‘1937లో ఈ గేయం నుంచి కొన్ని ముఖ్య చరణాలను తొలగించారు. దేశ విభజనకు బీజం వేసిన ఘటన అది. అలాంటి విభజన మనస్తత్వం నేటికీ దేశానికి సవాలుగానే మిగిలింది’’ అని ప్రధాని అన్నారు. భారత రాజ్యాంగ సభ 1950, జనవరి 24న వందేమాతరానికి జాతీయ గేయంగా గుర్తింపునిచ్చింది. ఈ గేయాన్ని 1896 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సందర్భంగా తొలిసారి ఆలపించారు. ఈ గీతానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్వరకల్పన చేశారని 1953లో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసారాల శాఖ ప్రచురణ ఒకటి వెల్లడించింది. ఈ గీతం 1900 ప్రాంతంలో బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి శక్తినందించింది.

ముస్లింలీగ్‌ అభ్యంతరం
ఈ దశలోనే కొందరు వేర్పాటువాద ముస్లిం నేతలు ఈ గీతానికి జాతీయ గీతం స్థాయి కల్పించడాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ‘‘మతతత్వ లక్షణాలు కలిగిన ఒక గీతానికి జాతీయ గేయం స్థాయిని కల్పించడం నాకు నిరాశ కలిగిస్తోంది’’ అని 1908, డిసెంబరు 30న జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్‌ సమావేశంలో సయ్యద్‌ అలీ ఇమామ్‌ అనే నాయకుడు పేర్కొన్నాడు. అయితే భారత జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ మాత్రం వందేమాతర గేయానికి అత్యున్నత గౌరవం ఇచ్చేవారు. ‘‘వందేమాతర గేయం నన్ను నా మనసును కట్టి పడేస్తూనే ఉంది. ఇది కేవలం హిందువులకో మరో మతవర్గానికో మాత్రమే పరిమితమైందన్న భావన నాకేనాడూ కలగలేదు’’ అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. ‘‘వందేమాతరం కోట్ల మంది ప్రజల మనసులపై రాజ్యం చేస్తోంది. ఈ గేయం వారిలో దేశభక్తి భావనను పెంపొందిస్తూనే ఉంది. ఈ గేయంలోని చరణాలు బెంగాల్‌ భారత దేశానికి ఇచ్చిన చెరగని బహుమతి’’ అని మహాత్ముడు హరిజన్‌ పత్రికలో 1939, జులై 1న రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. హిందూ ముస్లింలు కలసికట్టుగా నిర్వహించుకుంటున్న సభలో వందేమాతరం కారణంగా ఒక్క కలహం కూడా తలెత్త కూడదని నేను కోరుకుంటానని ఆయన అన్నారు. వందేమాతరంను బలవంతంగా ఎవరిపైనా రుద్దవద్దని గాంధీజీ స్వాతంత్రానంతరం పేర్కొన్నారు.

స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఈ వివాదం నేటికీ సమసిపోలేదు. 2009లో జమియాత్‌ ఉలమా-ఇ- హింద్‌ ముస్లింలు ఈ గీతాన్ని ఆలపించరాదంటూ ఫత్వా జారీ చేసింది. ‘‘మేం మా దేశాన్ని ప్రేమిస్తాం. మా ప్రేమను ఎన్నో దఫాలు నిరూపించుకున్నాం కూడా. అయితే ఇస్లాం ఏకేశ్వరవాదాన్ని నమ్మే మతం. వందేమాతరం ఆ వాదానికి విరుద్ధంగా ఉంది. మేం దేశాన్ని ప్రేమిస్తామే గానీ ముస్లింలు ఆరాధించే ఏకైక దేవుడైన అల్లాకు సమానమైన స్థాయిని కల్పించలేం’’ అని ఫత్వా పేర్కొంది.అయితే జమియాత్‌ ఉలమా-ఇ-హింద్‌ ఫత్వాను తీవ్రంగా ఖండిస్తూ దాదాపు 100 మంది ముస్లిం మేధావులు, సామాజిక కార్యకర్తలు, నటులు, రచయితలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వందేమాతరంపై వివాదం 1930 దశకంలోనే పరిష్కారమైపోయిందని వారు స్పష్టం చేశారు.