
భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారన్నారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని వివరించారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని చెప్పారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భగవాన్ కృష్ణుడిని కూడా కనకదాసు తన వైపు తిప్పుకున్నారని కొనియాడారు. అహంకారం ఎప్పుడు తగ్గుతుందో ఆరోజే మోక్షం కల్గుతుందని కనకదాస చెప్పారు. కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిలో పాల్గొనడం, భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
నవంబర్ 8న భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించిన భక్త కనకదాస అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. తన జీవితాన్ని శ్రీ కృష్ణ పరమాత్మ సేవకు వినియోగించారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.





