ArticlesNews

వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక పరామర్శ

129views

– రచన: డాక్టర్ పివిఎన్ కృష్ణ అధ్యక్షుడు, సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్.

శ్రీయుతమై, ధర్మాధిష్టితమైన ఈ భారతదేశాన్ని భారతీయ రాజుల అనైక్యత కారణంగా వశ పరచుకొని, సుమారు 800 సంవత్సరాలు ముస్లింలు తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్లు ఈ దేశ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. అయినా ఈ భారతదేశం ఒకపక్క వాళ్ళ హింసను ఎదుర్కొంటూనే తన ధర్మాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమించింది. ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భరతమాత సేవకు సమర్పణ చేశారు. ఈనాటి మన స్వాతంత్ర్యం వారి త్యాగాల ఫలితం. ఏ దేశం తన స్వాతంత్ర సమరయోధుల దేశభక్తుల త్యాగమయ పాత్రను గుర్తించి గౌరవించదో ఆ దేశం తన స్వాతంత్ర్యాన్ని నిలుపుకోచాలదని ప్రపంచ చరిత్ర మనకు చాటుతున్న పరమ సత్యం.

అలా గుర్తుంచుకోవలసిన మహనీయులలో ప్రధమంగా పేర్కొనవలసిన సాహితీకారుడు శ్రీ బంకించంద్ర చటర్జీ. మన దేశం మన తల్లితో సమానం మన తల్లిని మనం కాపాడుకోవాలి అనే భావన రేకెత్తించిన మొట్టమొదటి కవి. 1773 వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పై సాధుసంతులు జరిపిన తిరుగుబాటు ఆధారంగా ఆనందమఠ అనే అద్భుత గ్రంథాన్ని ఆవిష్కరించారు.1882 లో రచించబడిన ఈ గ్రంథంలో ఆ కాలంలో సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు సంవత్సరంలో ఒకసారి గ్రామాలకు వచ్చినపుడు గృహస్తులు వారికి భక్తితో కైంకర్యాలు సమర్పించేవారు. తమకు పన్నులు కట్టమంటే డబ్బు లేదని చెప్పే రైతులు సాధువులకు భక్తి పూర్వకంగా కైంకర్యాలు సమర్పించడం చూసి ఓర్వలేని ఈస్ట్ ఇండియా కంపెనీ అది దోపిడీ అని ముద్ర వేసి నిషేధించింది. అప్పుడు సాధువులు ఆనందమఠములో సమావేశమై ఈ భారతదేశం మా మాతృభూమి, దీని కోసం మేము ప్రాణాలు తెగించి పోరాడుతాం. అనే నిర్ణయం తీసుకొని వందేమాతర గీతంతో స్ఫూర్తి పొంది తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటులో పట్టుబడిన సుమారు 150 మంది సాధువులను బ్రిటిష్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉరితీసి చంపుతారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా చెప్పుకునే 1857 తిరుగుబాటుకు సుమారు 84 సంవత్సరాలకు పూర్వమే ఈ అద్భుత తిరుగుబాటు జరిగింది. దీనిని ఆనందమఠ్ గ్రంథం ద్వారా వెలుగులోకి తెచ్చిన శ్రీ బంకించంద్ర చటర్జీ ఆనాటి స్వాతంత్ర సమరయోధులలో గొప్ప స్ఫూర్తిని నింపాడు. అందులోని వందేమాతర గీతానికి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరకల్పన చేసి 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడంతో ఆ గీతం స్వాతంత్ర్య సమర శంఖా నినాదమై బ్రిటీష్ వారి గుండెలవిసేలా ప్రతిధ్వనించింది. కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి ప్రదీప్త గీతంగా మార్మోగిపోయింది.

బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా మొట్టమొదటిసారి 1905లో లార్డ్ కర్జన్ అనే వైస్రాయ్ చేసిన బెంగాల్ విభజనతో మరొక్కసారి భారతీయులు తిరగబడ్డారు. హిందూ ముస్లింలను విడదీయడానికి జరిగిన ఆ దుర్మార్గమైన కుట్రను ఆనాటి హిందువులు ముస్లింలు అందరూ వ్యతిరేకించారు. వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ ఒకరికొకరు రక్షాబంధనలు కట్టుకొని తమ అన్నదమ్ముల ఆత్మీయ బంధాన్ని ప్రబలంగా వ్యక్తీకరించారు. కానీ విడగొట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ప్రోద్బలంతో ముస్లింలు కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆగా ఖాన్ నేతృత్వంలో 1906 వ సంవత్సరంలో ముస్లిం లీగ్ స్థాపించుకున్నారు. అప్పటినుండి స్వాతంత్ర్యం సాధించే వరకు కూడా వాళ్లు దేశ విభజన మీదే దృష్టి సారించి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ‘డివైడ్ అండ్ క్విట్’ అనే నినాదాన్ని ఇచ్చారు. వందేమాతర గీతం లో హిందూ దేవతల పేర్లు ఉన్నాయని తమ మతాచారాలకు విరుద్ధమని విభేదం సృష్టించి వందేమాతరం పాడడాన్ని వ్యతిరేకించి దుర్మార్గమైన దేశ విభజనకు కారణమయ్యారు.

దానికి బీజం 1923 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలోనే నాటడం జరిగింది. అలీ బ్రదర్స్ గా పిలువబడే మౌలానా మహమ్మద్ అలీ జౌహార్, షౌకత్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఖిలాఫత్ ఉద్యమ నాయకులు. వీరు అంతర్గతంగా ముస్లిం లీగ్ సపోర్టర్స్ కూడా. 1923 సభకు మౌలానా అహ్మద్ అలీ అధ్యక్షత వహించారు. జాతీయ నాయకులు మోతిలాల్ నెహ్రూ, రాజాజీ, కస్తూరిబా గాంధీ, సరోజినీ నాయుడు రాష్ట్ర నాయకులు శ్రీ బులుసు సాంబమూర్తి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కొండా వెంకటప్పయ్య శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ మొదలగు మహామహులు వేదిక మీద ఉన్నారు.

1896 నుండి ప్రతి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనూ మొదట వందేమాతర గీతం పాడడం ఆచారంగా వస్తోంది. 1915 నుండి ప్రఖ్యాత హిందూస్తానీ విద్వాంసులు పండిట్ విష్ణు దిగంబర్ ఫలుస్కర్ వందేమాతర గీతంతో ఏఐసీసీ సమావేశాన్ని ప్రారంభిస్తున్నారు. కాకినాడలో కూడా సభా సదులందరినీ ఆహ్వానించిన తర్వాత ప్రార్థన గీతం వందేమాతరం ప్రారంభమైంది. వెంటనే అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ లేచి ఇది హారామ్… ఇస్లాముకు వ్యతిరేకమైనది.. కాబట్టి దీన్ని పాడడానికి వీల్లేదు అని గట్టిగా నిరోధించారు. కానీ ఫలుస్కర్ దానికి సమాధానం ఇస్తూ ఇది నీ మసీద్ కాదు. ఇది అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశం. ఇందులో ఇస్లాముకి వ్యతిరేకంగా ఒక్క పదం కూడా లేదు. పవిత్ర భారతదేశాన్ని మాతృభూమిగా భావించి భారత ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమ గీతంగా ఆలపించే ఈ పాట ఆపడం జరగదు అని విస్పష్టంగా ప్రకటించారు. దానితో అధ్యక్షుడు మౌలానా అహమ్మద్ అలీ మరియు అతని సోదరుడు షౌకత్ అలీ ఇతర ముస్లిం మద్దతుదారులు లేచి నిరసనగా వేదిక నుండి దిగిపోవడానికి ప్రయత్నించారు. నిర్వాహకులైన శ్రీ బులుసు సాంబమూర్తి కొండా వెంకటప్పయ్య పంతులు గార్లు సద్ది చెప్పి ఆపడానికి ప్రయత్నించగా వారు వినలేదు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వందేమాతరం ఆపడం జరగదు. ఇది భారతమాత గుండె చప్పుడు, భారతీయుల సమైక్య ఉద్యమ గీతం అని విష్ణు దిగంబర్ పలుస్కర్ ఉచ్ఛ స్వరంతో వందేమాతర గీతం ఆలపించడం ప్రారంభించారు. ప్రజలందరూ ఆయనకు మద్దతుగా వేదిక మీదకు వచ్చి వందేమాతర గీతాన్ని ఉజ్వలంగా ఆలపించారు. సభా ప్రాంగణం ప్రజల ఆనందోత్సాహాలతో ఉర్రూతలూగింది. కాంగ్రెస్ సమావేశం దిగ్విజయంగా జరిగింది.

ఈ సంఘటనతో లౌకిక వాద ముస్లింల ముసుగులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం నాయకుల నైజం బయటపడింది. తర్వాత కాలంలో కూడా వారు డైరెక్ట్ యాక్షన్ పేరుతో ముస్లిం లీగ్ అనేకమంది హిందువులను ఊచకోత కోసినా కిమ్మనకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే సెక్యులర్ ముసుగులో అనేక ప్రయత్నాలు చేసి దేశ విభజనకు బాటలు వేశారు. దేశ విభజన జరిగి మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా లౌకికవాదం పేరుతో ముస్లిం నాయకుల మాటలకే విలువనిచ్చి జాతీయ గీతంగా ఉండవలసిన మొత్తం వందేమాతర గీతాన్ని మొట్టమొదటి రెండు చరణాల వరకే కుదించడం ద్వారా జాతికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ఆ అద్భుత గీతానికి తీరని ద్రోహం చేసింది. ఆ జరిగిన ద్రోహాన్ని సరిచేయడానికి ఇప్పటికైనా ప్రజలంతా ముక్తకంఠంతో మొత్తం వందేమాతర సంపూర్ణ గీతాన్ని ఆలపించాలని ఈ గీత ఆవిష్కరణ జరిగి 150 సంవత్సరాల అయిన సందర్భంగా భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.