
సామాజిక సమరసత మనకు ఒక ముఖ్యమైన లక్ష్యం. దీని కోసం మనం హిందూ ధర్మం లేదా భారతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జడచైతన్యాలు, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి, ప్రాణి, పశు, పక్షి, చివరికి జడ వస్తువులలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. మనం కొత్త వాహనమో, మంచమో కొంటాము. దానిని పూజిస్తాము, కానీ అది జడ వస్తువు. ఇది ఒక సంకేతం. మనం నదులను పూజిస్తాము, చెట్లకు నీరు పోస్తాము, వాటిని కూడా పూజిస్తాము. ‘ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్’. (ఈశావాస్యోపనిషత్) అనగా, జడచైతన్య ప్రాణులతో కూడిన ఈ సమస్త సృష్టి పరమాత్మతో వ్యాపించి ఉంది. జగత్తులోని ప్రతి వస్తువు ఈశ్వరుని అంశమే. అది కొన్నిసార్లు వ్యక్తమవుతుంది, కొన్నిసార్లు కాదు. దుష్టులు కూడా ఈశ్వరుని అంశాలే. కానీ వారిలో దైవత్వం వ్యక్తమవ్వదు. సమస్త సృష్టి ఒకే తత్వం నుండి ఉద్భవించిందని మనం నమ్ముతాము, అప్పుడు ఈ హెచ్చుతగ్గులు, అంటరానితనం యొక్క అర్థం ఏమిటి? కానీ మానవ నిర్వహిత వ్యవస్థ కావడంతో అందులో అనేక మూఢనమ్మకాలు పుట్టుకొచ్చాయి. దాని స్వరూపం వికృతమైంది. వృత్తి ఆధారంగా కొన్ని కులాలు ఏర్పడ్డాయి. అవి మనిషి గుణ, కర్మలపై ఆధారపడి ఉండేవి, పుట్టుకపై కాదు.
భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో నాలుగు వర్ణాలు గుణ, కర్మల ఆధారంగా ఉన్నాయని, పుట్టుక ఆధారంగా కావని చెప్పారు. పుట్టుక ఆధారిత వివక్ష భారతదేశ ధర్మగ్రంథాలలో ఎక్కడా వ్రాయబడలేదు. ఏ పనీ గొప్పది లేదా తక్కువది కాదు. ధర్మానికి అనుగుణంగా సమాజ హితం కోసం చేసే ప్రతి కార్యం సత్కర్మ అవుతుంది, దీనికి విరుద్ధమైన కార్యం అధర్మం అవుతుంది. శారీరిక శ్రమతో కూడుకొన్న పనులు కూడా బౌద్ధిక సామర్థ్యంతో కూడిన పనులంత ముఖ్యమైనవీ, శ్రేష్ఠమైనవి. ఫలానా కుటుంబంలో పుట్టినవారు ఆ కుటుంబానికి సంబంధించిన పనినే చేయాలనే వికృతి మధ్య కాలఖండాలలో మన సమాజంలో ప్రవేశించింది. ఉదాహరణకు, నేతపనివారి కొడుకు నేతపనివాడు, రైతు కొడుకు రైతు, పూజారి కొడుకు పూజారి. దీనితోపాటు హెచ్చు తగ్గుల వికారం కూడా సమాజంలోకి వచ్చింది. ఈ కారణంగా కొంతమందికి నిర్దిష్ట ప్రదేశాలలో ప్రవేశం నిషేధించబడింది. వారిని తక్కువ స్థాయి వారిగా పరిగణించడం ప్రారంభమయింది.
ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుంది.
అజ్యేష్ఠాసో అకనిష్ఠాస ఏతే సంభ్రాతరో వావృధుః సౌభగాయ |
యువా పితా స్వపా రుద్ర ఏషాం సుదుఘా పృష్నిః సుదినా మరుద్భ్యః ||
అనగా ఎవరూ పెద్దవారు కాదు, ఎవరూ చిన్నవారు కాదు, అందరూ సోదరులే, అందరూ బంధువులే, అందరూ అన్నదమ్ములే. మనం ఈ మంత్రాన్ని మనసులో నిలుపుకోవాలి.
ఋగ్వేదంలో మరో మంత్రం వస్తుంది
సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః |
సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి ॥
దీని భావం ఏమిటంటే – సమస్త సమాజానికి ఒకే ఉద్దేశ్యం ఉంది. మన భావనలు సుసంగతంగా ఉండాలి, మన ఆలోచనలు ఏకమవ్వాలి. ఈ విశ్వంలోని, బ్రహ్మాండంలోని వివిధ అంశాలలో, కార్యకలాపాలలో ఎలాగైతే సామరస్యం, ఐక్యత ఉన్నాయో ఆ విధంగా.
కానీ హిందూ సమాజంలో ఈ ఐక్యతకు భంగం కలిగింది. మన సమాజంలో కొన్ని లోపాలు వచ్చాయి, కానీ మనం మొదట్నుంచీ ఇలా లేము. బౌద్ధికంగా మన పూర్వీకులు చాలా శ్రేష్ఠులు. ప్రపంచానికి మనం ఎన్నో కొత్త ఆలోచనలను ఇచ్చాము, కానీ ఈ వికృతుల కారణంగా చాలా సంవత్సరాలు విదేశీ దాస్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సంఘర్షణ కాలంలో మన సమాజంలో అనేక మార్పులు జరిగాయి, కానీ ఇప్పుడు ఏది ఉచితమో, ఏది అనుచితమో ఆలోచించి అనుచితమైన వాటిని త్యజించే సమయం వచ్చింది.
మనదేశంలో కాలానుగుణంగా సాధువులు, గురువులు, సామాజిక కార్యకర్తలు మొదలైన మహానుభావులు అందరూ మన సమాజం వివక్షనుండి విముక్తి పొంది సమానత్వం, సమరసతను పొందాలని ఆకాంక్షించారు. వారు అంటరానితనాన్ని పాపంగా, అమానవీయ సంప్రదాయంగా భావించారు. సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ కూడా తన హిందూ ఐక్యతా ప్రయత్నాలలో భాగంగా, సంఘంలో ప్రారంభం నుండీ కుల చింతనను దూరం పెట్టారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సరసంఘచాలక్ బాలా సాహెబ్ దేవరస్ తన లోతైన సంవేదనాత్మక అనుభూతి కారణంగా స్పష్టమైన మాటలలో, “అంటరానితనం నేరం కాకపోతే, ప్రపంచంలో మరేదీ నేరం కాదు” అని అన్నారు. వివక్షను తొలగించడానికి, సమరసతను స్థాపించడానికి నేడు యావత్ సమాజం ఆచరణ స్థాయిలో ముందుకు రావలసిన అవసరం ఉంది. సంఘం ఎల్లప్పుడూ స్పష్టంగా చెప్పింది:
“హిందవః సోదరాః సర్వే, న హిందుః పతితో భవేత్” అనగా హిందువులందరూ సోదరులే. ఏ హిందువు కూడా పతితుడు కారు.
“మమ దీక్షా హిందూ రక్షా” నా కర్తవ్యం హిందూ రక్షణ.
“మమ మంత్రః సమానతా”– సమానత్వమే నాకు మంత్రం.





