ArticlesNews

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 4వ భాగం

15views

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 3వ భాగం

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, దేవసం బోర్డులుతో పాటు కొందరు అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా అయ్యప్పస్వామికి యథాశక్తిన అన్యాయం తలపెట్టారు. ధర్మం అనే మహోన్నత దృష్టికి మహాద్రోహం తలపెట్టారు. ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు మాజీ అధ్యక్షుడు సీకే గుప్తన్‌ వెల్లడిరచిన ఒక విషయం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. అయ్యప్ప ఆలయంలో తంత్రి (ప్రధాన అర్చకుడు)గా మోహనారు కాంతారురు గతంలో పనిచేశాడు. కానీ ఇతడు ఎర్నాకులంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక కాల్‌గర్ల్‌తో  పట్టుబడ్డాడు. దీనితో ఆయనను ఆలయం నుంచి బహిష్కరించారు. అతడు మళ్లీ గర్భగుడిలో విధులు నిర్వర్తించేందుకు మార్గం సుగమం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని అతడి కుటుంబం బేరమాడిరదని గుప్తన్‌ తెలియచేశాడు. ఈ గుప్తన్‌ ఎవరో కాదు. సీపీఎం ప్రముఖుడు ఈఎంఎస్‌ నంబూద్రి అల్లుడు. తంత్రి, మేల్‌శాంతిల ఆగడాలకు హద్దు లేదు. ఇటీవలి కాలంలోనే వాజీ వాహనం (దేవుడి వాహనం) గురించి ఒక వార్త వచ్చింది. జెండా కర్ర వంటి దానికి పైన బంగారు గుర్రం ఉంటుంది. దీనిని కొడిమరం అంటారు. ఇది కనిపించకుండా పోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వాహనం  బాధ్యత తంత్రిదే. దీని మీద దర్యాప్తు చేయించాలని ప్రస్తుత తంత్రి రాజీవ్‌ కాంతారును కొందరు భక్తులు కోరారు. వాజీ వాహనం తన వద్ద మాత్రమే ఉంటుందని చెప్పాడు. అంత ఖరీదైన వాహనం మీ దగ్గర ఎందుకు ఉండాలని నిలదీస్తే అతడి నుంచి సమాధానం లేదు.  తంత్రి కావచ్చు, మేల్‌శాంతి కావచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఈ పదవులలో ఉన్నవాళ్లు దోచే తీరు కూడా భయానకం. మేల్‌శాంతి పూజాదికాలు నిర్వహిస్తాడు. వాటిని సరైన సమయంలో నిర్దేశించే విధంగా పర్యవేక్షించేవాడు తంత్రి.

గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కేరళలో హిందూత్వకు బెడద ఏర్పడిరది. కోర్టులు, రాజకీయ పార్టీలు, ముస్లిం మతోన్మాదులు మూకుమ్మడిగా హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.  ఇది గమనించడానికి హిందువులకు ఇంకా ఎంతకాలం పడుతుందో అర్ధం కావడం లేదు. హిందూ ఆలయాల పట్ల అత్యంత అమర్యాదకర ధోరణితో ఉన్న కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కూ ఇప్పటికీ ఓటు వేయడానికి వారికి మనసు ఎలా ఒప్పుతుందో అసలే అర్ధం కాదు.


హిందూద్వేషులే ఆలయాల ధర్మకర్తలు

కేరళలో ఐదు దేవసం బోర్డులు ఉన్నాయి. ఒక బోర్డు పరిధిలో అనేక ఆలయాలు ఉంటాయి. ట్రావెన్కూర్‌ (1249 ఆలయాల మీద అజమాయిషీ), మలబార్‌ దేవసం బోర్డు (1401 ఆలయాలు), కొచ్చిన్‌ బోర్డు (ఒకనాటి కొచ్చిన్‌ రాష్ట్రంలోని అన్ని ఆలయాలు), గురువాయూర్‌ (12 ఆలయాలు), కూడల్‌మానిక్కం (ఒకే ఆలయం ఉంది. కానీ ఐదు దేవసాలలోను సభ్యత్వం ఉంది) అనే ఐదు బోర్డులు అక్కడ హిందూ దేవుళ్ల సంపదను అడ్డంగా బొక్కుతున్నాయి. కానీ తిరువనంతపురం పద్మనాభస్వామి దేవస్థానం స్వతంత్రంగా ఉంది. ఆ దేవస్థానాన్ని కూడా కబ్జా చేయాలని కమ్యూనిస్టు ప్రభుత్వం చాలా ఎత్తులే వేసింది. కానీ అర్చక స్వాముల పట్టుదల, స్థానికుల పోరాటం, వంశ పారంపర్య ధర్మకర్తల ఆశయం కమ్యూనిస్టుల ఆటలు సాగనివ్వడం లేదు. మొత్తంగా ఆ ఐదు దేవసాల పరిధిలో 3000 దేవాలయాలు ఉన్నాయి. కానీ తాజాగా బయటపడిన అక్రమాలు కేవలం రెండు ముఖ్య ఆలయాలకు సంబంధించినవే.

 దేవసం బోర్డులు పెద్ద సంఖ్యలో ఆలయాలను అజమాయిషీ చేస్తాయి. దేవసం బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది. ఆ బోర్డుల అధ్యక్షులుగా, సభ్యులుగా అధికార పార్టీ సభ్యులనే నామినేట్‌ చేస్తారు. ప్రతి బోర్డుకు ఒక మంత్రి ప్యవేక్షకునిగా ఉంటాడు. కేరళలో హిందూ ఆలయాలను కమ్యూనిస్టులు జాతీయ చేశారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందు మల్హోత్రా వ్యాఖ్యానించారు కూడా. దీనితో ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు మాజీ చైర్మన్‌ కె. అనంతగోపన్‌ మండిపడ్డారు. కోర్టులు కూడా చాలాసార్లు సీపీఎం సర్కారు దుండగీడుతనం మీద ఘాటుగానే స్పందించాయి. ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు కమిషనర్‌గా సీఎన్‌ రామన్‌ అనే అతడిని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే అతడు సీపీఎం నాయకుడు. డిసెంబర్‌ 14, 2023న అతడిని నియమించారు. కానీ పదవీ విరమణ రోజునే ఈ తీర్పు వచ్చింది.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వీటి అధ్యక్షులు, సభ్యులు మారుతూ ఉంటారు. కాంగ్రెస్‌,  కమ్యూనిస్టు పార్టీల రాజకీయ నిరుద్యోగులకు ఇవి పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి సభ్యులు మారినప్పుడల్లా కొత్త దోపిడీ మొదలవుతూ ఉంటుంది. వీళ్ల ఘనకార్యం ఒక్కటే దేవస్థానాల ఆస్తులను పీకల దాకా బొక్కడం. కానీ కేరళలో ప్రభుత్వం అధీనంలో కాకుండా వ్యక్తులు, కుటుంబాలు, ఇతర సంస్థలు నడుపుతున్న దేవాలయాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ముఖ్యంగా అవినీతి లేకుండా సజావుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మోటారు వాహనాల శాఖ, వాటి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, తాలూకా ఆఫీసులు ఉంటాయి. వీటిలాగే దేవస్థానాలు కూడా అవినీతి మయమైపోయాయి.దేవసం బోర్డులను తక్షణం రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది.

ఈ మకిలి దేవసాలన్నీ 2023లో పెద్ద ఘనకార్యం చేయబోయాయి. దేవసం బోర్డుల అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయ ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు నిర్వహించరాదని, శిక్షావర్గలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే పని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చేసింది. అయ్యప్ప ఆలయంలో బంగారం కాజేసిన ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు గుళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు నడిపితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించడమే వింత. శాఖల నడపడం వల్ల ఆలయాల పవిత్రకు భంగం వాటిల్లుతున్నదని భక్తులు గగ్గోలు పెట్టారని దేవసం ఆరోపణ. అయితే క్రైస్తవులను, ముస్లింలను రోజువారీ కూలీలు కింద ఈ ఆలయాలలో పని చేయడానికి నియమించడానికి ఈ బోర్డులు ప్రయత్నించాయి.

దేవాలయాలలో జరిగే ఉత్సవాలను కమ్యూనిస్టులు పార్టీ ప్రచార కార్యక్రమాలుగా తయారు చేవారు. గడచిన ఐదేళ్లలో ఈ ధోరణి బాగా ముదిరింది. హిందూ దేవాలయంలో జరిగిన ఒక ఉత్సవం వీడియో ఆ మధ్య బయటపడిరది. కానీ అది ఎక్కడా హిందూ ఆలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలా లేదు. వేదిక వెనుక డీవైఎఫ్‌ఐ (సీపీఎం విద్యార్థి విభాగం) పేరు రాశారు. అదొక సంగీత కార్యక్రమం. అందులో కమ్యూనిస్టు లను ఆకాశానికి ఎత్తేస్తూ పాట ఉంది. కడక్కల్‌ దేవి (కొల్లాం జిల్లా) ఉత్సవాలలోను ఇదే జరిగింది. ఇదే ఆలయంలో ఏడాది క్రితం నవ కేరళ ఉత్సవం జరపతలపెట్టారు. కానీ హైకోర్టు జోక్యంతో వేరే చోటికి వేదిక మారింది. ఆలయ ప్రాంగణాలు రాజకీయ ప్రచారానికి కాదని కోర్టు గుర్తు చేయవలసి వచ్చింది. హిందువులు జరుపుకునే ప్రతి పండుగను కమ్యూనిస్టులు హేళన చేస్తారు. కానీ ఆ పండుగలను, ఆలయాలలో జరిగే ఉత్సవాలను తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవ డానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోరు. కడక్కల్‌ దేవి ఆలయం గొడవ సద్దుమణగక ముందే ప్రముఖ గాయని గౌరీలక్ష్మి ఒక ఆలయంలో పాడిన విప్లవగీతం మళ్లీ రగడ రేపింది. గౌరీలక్ష్మి అక్కడ ఒక్కచోటే కాదు, ఎక్కడ హిందూ ఆలయంలో ఉత్సవం జరిగినా ఆ పాటే పాడుతుందని తరువాత బయటపడిరది.