
పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది. మహిళల్ని ఉగ్రవాదంలో తీసుకురావడం ద్వారా జైష్ తన ఉనికిని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మే 7న భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో పాకిస్తాన్ బహవల్పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. ఆ సమయంలో ఉగ్రవాదులతో సహా సయిదా భర్త మరణించాడు.
ఇదిలా ఉంటే, సమాచారం ప్రకారం, ఉగ్రవాద సంస్థ నవంబర్ 9న ఉదయం 10 గంటలకు కరాచీలో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పేద మహిళల్ని, ఉగ్రవాదుల భార్యల్ని, చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబంలోని మహిళల్ని రిక్రూట్ చేసుకునేందుకు జైష్ ప్రయత్నిస్తోంది. వీరికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మహిళా ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ సైన్యం, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రకమైన ఉగ్రవాద దాడుల కోస మహిళల్ని ఉపయోగించుకోవాలని జైషే వ్యూహాలు పన్నుతోంది. ‘‘భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటుంది. మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది. కాబట్టి మనం మన మహిళల్ని సిద్ధం చేయాలి’’ అని ఉగ్రసంస్థ విషబీజాలు నాటుతోంది.





