News

భారతీయుడిపై కెనడియన్‌ జాత్యహంకార దాడి

47views

కెనడాలో వలసదారులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళనల నడుమ, మరో కలవరపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని ఓ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో, భారత సంతతికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఒకరిపై శ్వేతజాతీయుడు అకారణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, నవంబర్ 1వ తేదీన ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో, టొరంటో బ్లూ జేస్ జాకెట్ ధరించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రెస్టారెంట్‌లోని ‘మొబైల్ ఆర్డర్ పికప్’ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న బాధితుడి వద్దకు వెళ్లి, ఎలాంటి కారణం లేకుండా అతడిని నెట్టేశాడు. దీంతో బాధితుడి చేతిలోని ఫోన్ కిందపడిపోయింది.

బాధితుడు ప్రశాంతంగా తన ఫోన్‌ను తీసుకుంటుండగా, దాడి చేసిన వ్యక్తి మరింత రెచ్చిపోయి అతని కాలర్ పట్టుకుని వెనక్కి నెట్టాడు. “నా ముందు గొప్పగా ప్రవర్తిస్తున్నావా” అంటూ ఆ వ్యక్తి ఆరోపణలు చేయడం వీడియోలో వినిపిస్తోంది. బాధితుడు ఎలాంటి ప్రతిఘటన చూపకుండా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడి సిబ్బంది జోక్యం చేసుకుని, గొడవను బయట చూసుకోవాలని ఇద్దరికీ సూచించారు. అనంతరం ఆ శ్వేతజాతీయుడిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించారు.

ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వీడియోలో ఉన్న ఇద్దరి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు.

ఇటీవల కెనడాలోని ఎడ్మంటన్‌లో భారత సంతతికి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అర్వీ సింగ్ సాగూను ఓ అపరిచితుడు హత్య చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. తన వాహనంపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని నిలదీయడంతో, అతను సాగూ తలపై బలంగా కొట్టాడు. అక్టోబర్ 19న జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగూ, చికిత్స పొందుతూ అక్టోబర్ 24న మరణించారు. ఈ వరుస ఘటనలతో కెనడాలోని వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.