
( నవంబర్ 7 – వందేమాతర గీతంకు 150 ఏళ్ళు )
వందేమాతర గీతం… అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. ‘అమ్మ’ అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం. దాన్ని ఆధ్యాత్మికవేత్తలు ‘సాక్షాత్తు రుషి వాక్కు’గా అభివర్ణిస్తే…. ఉద్యమకారులు ‘పోరాట స్ఫూర్తి కేంద్రం’గా ప్రకటించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సమస్త జాతినీ ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు!
‘నల్లవాడివి. నీకు పల్లకీ కావాల్సి వచ్చిందా? తక్షణం దిగిపో…’ అని రంకెలేస్తూ వస్తున్నాడతను. ఆ అరుపులకు బోయీలు భయపడిపోయారు. ఠక్కున ఆగిపోయారు. లోపల కూర్చుని ఉన్న బంకిమ్‌చంద్ర మేనా ఎందుకు ఆగిందో తెలుసుకునేలోపే… ఓ తెల్లవాడు దూసుకొచ్చాడు. వచ్చీ రావడంతోనే, బంకిమ్చంద్రను బయటకు లాగి, ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. అంతలోనే, ఎవరో ‘కల్నల్..! ఆయన మన డిప్యూటీ మేజిస్ట్రేట్ బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ!’ అని సర్దిచెప్పబోయారు. ‘అయితే… ఏంటి?’ అన్నాడా తెల్లదొర. ‘అయితే ఏమిటా… ఇంతకి రెండింతలు అనుభవిస్తావ్ చూసుకో…’ అని రోషంగా జవాబిచ్చాడు బంకిమ్‌చంద్ర పైకిలేస్తూ. ఆ కోపానికి జంకిన తెల్లవాడు ‘సారీ’ అన్నట్టు పెదాలు కదిలించాడు. ‘ఇక్కడ కాదు కోర్టులో చెప్పు ఆమాట’ అని సూటిగా బదులిచ్చి ముందుకు కదిలాడు బంకిమ్‌చంద్ర.
నేరుగా వెళ్లి తన మీద చేయి చేసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ డఫిన్పైన క్రిమినల్ కేసు పెట్టాడు. వెంటనే విచారణ మొదలైంది. కానీ జడ్జి కోర్టు గదిలోకి రావడానికి ముందు బంకిమ్చంద్రని తన ఛాంబర్‌కి పిలిచాడు. అప్పటికే అక్కడ డఫిన్ ఉన్నాడు. ‘ఈయన డిప్యూటీ మేజిస్ట్రేట్ అనే విషయం నాకు నిజంగానే తెలియదు’ అంటూ అమాయకత్వం నటించాడు ఆ తెల్లదొర. జడ్జి కూడా అంతే నాటకీయంగా బంకిమ్‌చంద్ర వైపు చూసి ‘పాపం… తెలియక చేశాడట. కేసు ఉపసంహరించుకోండి’ అని సలహా ఇచ్చాడు. ‘కుదర్దు’ కచ్చితంగా చెప్పాడు బంకిమ్‌చంద్ర. ‘ఇలా ఇద్దరు ఉన్నతాధికారులు గొడవపడటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మాయని మచ్చ తెస్తుంది’ అన్నాడు జడ్జి. ‘సరే… నేను కేసు విత్‌డ్రా చేసుకుంటాను. కానీ అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి’ అని షరతు విధించాడు బంకిమ్‌చంద్ర. జడ్జి ఒప్పుకోక తప్పలేదు. అలా నిండు న్యాయస్థానం సాక్షిగా క్షమించమని కోరాడు డఫిన్. అయినా, బంకిమ్‌చంద్ర గుండెల్లోని అవమానాగ్ని చల్లారలేదు.
‘నేను బెంగాల్లో తొలి భారతీయ ఐసీఎస్ ఆఫీసర్ని. నన్నే ఇలా అవమానిస్తే… సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందీ?’ అనుకున్నాడు. దీర్ఘకాలిక సెలవు తీసుకుని, కోల్‌కతాకు బయల్దేరాడు. అంతలోనే పిడుగుపాటు లాంటి సమాచారం… బ్రిటిష్ ప్రార్థనాగీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ని ‘భారత జాతీయ గేయం’గా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందట! ఆ వార్త బంకిమ్‌చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసింది. పెల్లుబికిన ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది…
వందేమాతరం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం…
సస్యశ్యామలాం మాతరం.
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం
… ఈ రెండు పాదాలనూ బంకిమ్‌చంద్ర 1875, నవంబరు 7న రాశాడని అంటారు. అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సమ్రాట్టుగా సుప్రసిద్ధుడు, వచన రచనలో సిద్ధహస్తుడు. భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసినవాడిగానూ సుపరిచితుడు. బంకిమ్‌చంద్ర రాసిన ‘దుర్గేశనందిని’, ‘అనుశీలన మిత్ర’ వంటి నవలలు బెంగాల్లో కొత్తతరం పాఠకులను ఆకట్టుకుంటున్న సమయం అది. కానీ ఆయన ‘వందేమాతరం’ మాత్రం పండితులకి పెద్దగా నచ్చలేదు, పామరులకు ఏమాత్రం అర్థం కాలేదు.
విసిరికొట్టండి…
‘గేయాన్ని సంస్కృతం-బెంగాలీ భాషల కలగాపులగంగా రాయడం దుష్టసంప్రదాయం’ అన్నది నాటి వయాకరణుల అభ్యంతరం. ఆ విమర్శలకు విసిగిపోయి, ‘మీకు నచ్చితే చదవండి… లేకుంటే విసిరి అవతల పారేయండి’ అనేవాడట బంకిమ్. ఓసారి ఆయన నడుపుతున్న పత్రికలో కాస్త స్థలం మిగిలిపోతే, ‘ఈ ఖాళీలో మీ కవితను పెడదామా?’ అని అడిగాడట ఉప-సంపాదకుడు. ‘అది ఫిల్లర్‌లా వేయడానికి రాసింది కాదు. దాని విలువ ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది. అప్పటికి నేనూ ప్రాణాలతో ఉండకపోవచ్చు కూడా’ అని స్థిరంగా చెప్పాడట బంకిమ్. ఆ మాటే నిజమైంది. ఆయన బతికున్నంత కాలం వందేమాతర గీతం సామాన్యులకు చేరలేదు. ఆలోపు దానికి మరో రెండు పాదాలు చేర్చి ప్రార్థన గీతంగా తన ‘ఆనందమఠ్’ నవలలో ఉపయోగించాడు. 1777లో బ్రిటిష్వాళ్లపైన పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఈ నవల.
ఈ పుస్తకం సంచలనం సృష్టించినా, గేయం మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అయితేనేం, మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందులోని గాఢతను గుర్తించాడు. దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించిన తీరు ఆయనను ఆకట్టుకుంది. తానే స్వయంగా బాణీకట్టి 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో హృద్యంగా ఆలపించాడు. మరో తొమ్మిదేళ్ల తర్వాత… అంటే, 1895లో బంకిమ్ చనిపోయాడు. ఆయన ఊహించినట్టే… అప్పటికీ ఆ పాట పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆ మహత్తు జగత్తుకు తెలియడానికి ఇంకో పదేళ్లు పట్టింది. ‘బెంగాల్ విభజన’ సమయంలో… ఆ అక్షరాలు అగ్ని కణికలై మండాయి.
దావానలంలా…
1905… అక్టోబర్ 16. ఆ రోజు శ్రావణ పౌర్ణమి… రక్షా బంధన్. ఆంగ్లేయులు బెంగాల్ విభజనని అమలు చేసిన రోజు! 1857నాటి తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తమకి ముచ్చెమటలు పట్టించిన హిందూ-ముస్లిం ఐక్యతని దెబ్బతీయడం ఆ నిలువుకోత ప్రధాన ఉద్దేశం. తెల్లవారి నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌కతా ప్రజానీకం టౌన్‌హాల్ దగ్గర పెద్ద ఎత్తున గుమికూడింది. ఆ సమూహానికి ఠాగూర్ నేతృత్వం వహించారు. అమ్మాయిలు తమ సోదరులకి రక్షాబంధన్ కట్టే పద్ధతినే కాస్త మార్చి… హిందూ-ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చారాయన.
ఆ సందర్భంగా దేశమాతని స్మరించుకునేలా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. ఆయన్ని అనుసరిస్తూ… వీధివీధినా ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. చూస్తుండగానే అది మంత్రమైంది… మహోపదేశమైంది. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమాన్ని’ మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ పాటని అపురూపంగా అందుకున్నారు. ముఖ్యంగా బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశాడు.
విప్లవ సాహిత్యం!
వందేమాతరం నినాదాన్నీ, గేయాన్నీ వాయువేగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. ఆ సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ (తర్వాతి కాలంలో అరవింద యోగి అయ్యారు) మొదటిసారిగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ ప్రతి 1905-1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకీ తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తర్వాత కానీ, బ్రిటిష్ పాలకులు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు.
‘ఆనందమఠ్’ నవలలో భాగమైన వందేమాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను మృత్యుదేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని ‘రాక్షసులు’ అనే మాటను తమకు అన్వయించున్నారు. ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులూ కర్షకులూ రైతులూ మహిళలూ… ఒకరేమిటి, సమస్త ప్రజానీకం పోరాటయోధులుగా మారారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అంటున్నా, ఆ ప్రభావం 1947 వరకూ మహోజ్జ్వలంగా కొనసాగింది.
చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడు!
అది 1907వ సంవత్సరం. ఫిబ్రవరిలో ‘వందేమాతరం’ గీతం రాజమహేంద్రి యువతని తొలిసారిగా ఉద్యమం వైపు నడిపించింది. అక్కడి విద్యార్థులు ఆ గీతాన్ని ఎలుగెత్తి పాడుతూ ఊరేగింపుగా నడిచారు. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆ బృందానికి నాయకుడు. ఈ పరిణామాన్ని ప్రిన్సిపల్ హంటర్ సహించలేకపోయాడు. విద్యార్థులకు ఓ హెచ్చరికగా… హరిసర్వోత్తమరావుని కాలేజీ నుంచి బహిష్కరించాడు. అయనా, ఎవరూ బెదరలేదు. మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నెల రోజుల తర్వాత, బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయనకి హరిసర్వోత్తమరావే స్వాగత పత్రం అందజేశాడు.
ఆ పరిణామంతో మరింత రెచ్చిపోయిన హంటర్… హరిసర్వోత్తమరావుకి ఎక్కడా ఉద్యోగం రాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు తెప్పించాడు. దాంతో… అప్పటిదాకా కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది. హంటర్ 138 మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాడు. ఆ నిర్ణయంతో రాజమహేంద్రవరం అట్టుడికిపోయింది. విద్యార్థులకి మద్దతుగా గ్రామాల్లోనూ ‘వందేమాతరం సంఘాలు’ వెలిశాయి. ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా… ‘వందేమాతరం!’ అంటూ నిరసన తెలపడం నిత్యకృత్యమైంది. ఆ వేడి కోటప్పకొండ తిరునాళ్ల దాకా పాకింది…
చేబ్రోలు దగ్గర ఉన్న రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు… చిన్నపరెడ్డి. కోటప్ప తిరునాళ్ల కోసమని ప్రభని కట్టుకుని వచ్చాడు. అతని కోడెదూడలు జనాన్ని చూసి బెదిరిపోయి అటూఇటూ పరుగెత్తాయి. చిన్నపరెడ్డి అదిలించి అదుపులోకి తీసుకొస్తుండగానే… ఓ ఇంగ్లిషు పోలీసు అధికారి దురుసుగా తుపాకీ తీసి ఓ ఎద్దును కాల్చేశాడు. తన ప్రాణానికి ప్రాణమైన మూగజీవం కుప్పకూలడంతో చిన్నపరెడ్డి ఆ ఇంగ్లిషు అధికారిపైన తిరగబడ్డాడు. ‘వందేమాతరం!’ అంటూ ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదాడు. ఆ నేరానికి ఇంగ్లిషు ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను అమలు చేసిన రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదం మారుమోగింది.
స్ఫూర్తి మంత్రమై…
స్వాతంత్య్ర పోరాటంలో… వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు… కుదిరామ్ బోస్. బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యాడు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్. అప్పుటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే… కోల్‌కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం… వందేమాతరం!
ఉప్పు సత్యాగ్రహం సమయంలో… బుధు నోనియా అనే బిహారీ బాలుడు ‘వందేమాతరం’ అంటూ ఉప్పు కాసేచోట తిరగసాగాడు. అదంతా చూసిన ఓ బ్రిటిష్ పోలీసు ఒళ్లు తెలియని ఆవేశంతో… ఆ పసివాణ్ణి ఉప్పు కొలిమిలోకి విసిరేశాడు! ఆ పరిస్థితుల్లోనూ ఆ చిన్నారి ‘అమ్మా… అమ్మా…’ అని అరవలేదు. ప్రాణాలు గాల్లో కలిసేదాకా ‘వందేమాతరం’ అంటూనే ఉన్నాడు!
మాతంగి హజ్రాకి పన్నెండేళ్లకే పెళ్లయింది… పద్దెనిమిది అయినా నిండకుండానే వితంతువైంది. అరవై ఏళ్ల వయసులో గాంధీజీ పిలుపుతో స్వాతంత్య్ర సమరంలోకి అడుగుపెట్టింది. 1942 సెప్టెంబర్ 29న పశ్చిమ్‌బంగ మిడ్నాపూర్ జిల్లా పోలీసు స్టేషన్ ముందు అనేకమంది మహిళలతోపాటూ ఆమె ధర్నా చేస్తుంటే… పోలీసులు హఠాత్తుగా కాల్పులకి దిగారు. ‘అందర్నీ వద్దు… నన్ను కాల్చు’ అంటూ ఒంటరిగా ముందుకెళ్లింది హజ్రా. ఆమె ఒక్కో అడుక్కీ… ఒక్కో తూటాని పేలుస్తూనే వచ్చారు పోలీసులు. ప్రతి దెబ్బకూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది హజ్రా. నేలకి ఒరిగేదాకా అదే నినాదం.
తెలంగాణలోనూ వందేమాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గేయాన్ని గళమెత్తి పాడారు. అది సహించని అధికారులు వాళ్లని లోపలే బంధించి తాళం వేశారు. సాయంత్రానికి వదిలేసినా… ఆ తర్వాతి రోజు నుంచీ క్లాసులకి అనుమతించలేదు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు. చూస్తుండగానే ఆ ఉద్యమం హైదరాబాద్‌లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది. పాలకులకు చెమటలు పట్టాయి. అలా ఆ నిరసనల్లో పాల్గొన్న 1550 మంది విద్యార్థుల్నీ విద్యాసంస్థ నుంచి బహిష్కరించారు. దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీటివ్వకూడదని కఠినంగా ఆదేశించారు. అయినా సరే, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశం ఇచ్చింది. అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావూ ఒకరు!
విభజన మొదలు..!
1920 వరకూ వందేమాతరం… స్వాతంత్య్ర సంగ్రామంలో అన్ని మతాలవారి ఉమ్మడి నినాదంగానే ఉండేది! విభజించి పాలించడంలో నేర్పరులైన బ్రిటిషువారు ఆ గేయానికి హిందువుల ప్రార్థనా గీతమనే దుష్ప్రచారం కల్పించారు. ఈ భావనకి 1920-30లలో చోటుచేసుకున్న మతకల్లోలాలు మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచీ వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఉంది. కానీ… కొందరు ముస్లిం నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో 1937 నాటి సమావేశంలో ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ సాయం కోరారు నెహ్రూ.
పాటలోని తొలి రెండు పాదాలూ ఏ మతానికీ వ్యతిరేకం కావని స్పష్టం చేశారు ఠాగూర్. అయినా కాంగ్రెస్ వెనకడుగు వేసింది. పార్టీ పెద్దల తీరు వల్ల సుభాష్ చంద్రబోస్లాంటివాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ ఉదాసీనత మహాత్మాగాంధీని కూడా బాధపెట్టిందని అంటారు. ‘నన్ను ఎంతగానో కదిలించిన గీతమిది. నేటికీ కోట్లాది గుండెల్లో నినదిస్తోంది. ఏం చేద్దాం… ఒక్కోసారి మేలిమి బంగారాన్ని కూడా మామూలు లోహంలా పరిగణించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది’ అన్నారాయన బాధగా. మౌలానా అబుల్ కలాం అజాద్‌లాంటి నేతలైతే, తాము పాల్గొనే ప్రతి సమావేశంలోనూ ఈ పాట ఉండితీరాలని చెప్పేవారు!
1947లో స్వాతంత్య్రం సిద్ధించిన రోజు… వందేమాతరాన్నే తొలి విజయగీతంగా ఆకాశవాణిలో వినిపించారు! దాంతో, అప్పటి వరకూ ఉన్న నిషేధమూ తొలగిపోయింది. ఇక, 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ‘వందేమాతరం గేయాన్ని… రవీంద్రుడి జనగణమన జాతీయగీతంతో సమానంగా గౌరవించాలి… అదే స్థాయి హోదాని కల్పించాలి’ అంటూ తీర్మానించింది.
అసతోమా సద్గమయ… అనే వేదవాక్యమూ, సత్యమేవ జయతే… ఉపనిషత్తు పాఠమూ, జననీ జన్మభూమిశ్చ… రామాయణ శ్లోకమూ, మా ఫలేషు కదాచన… గీతా ప్రబోధమూ, నో దై సెల్ఫ్… సోక్రటీస్ సూత్రమూ, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప… అనే మార్క్స్ నినాదమూ …మనిషి వికాసానికి మైలురాళ్లుగా నిలిచిన వాక్యాలు. ‘వందేమాతరం’ కూడా నిస్సంశయంగా ఆ కోవకి చెందిందే.
ఎన్నో ప్రత్యేకతలు…
రెండింటికీ సమాన హోదాయే ఉన్నా ‘జనగణమన’ పాడటానికి… చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఆ బాణీని ఎవరూ మార్చకూడదు, పాడే సమయమూ (52 సెకన్లు) మారకూడదు. వందేమాతరానికి ఆ పరిమితులు లేవు. కాబట్టే వేలాది వెర్షన్లు వచ్చాయి.
1947 ఆగస్టు 15… మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు.
ఏ వాద్య సంగీతమూ లేకుండా… అచ్చమైన గాత్రాన్ని వినిపించారు. పాటలోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు!
దూరదర్శన్‌లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. దానికి కూడా ఇదే కారణమని అంటారు.
బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో… ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటి స్థానం ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది.
1906లో పాథేఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలారోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీచేయించి మనదేశానికి తెప్పించారు.





