
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాలతాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటుచేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో బుధవారం ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు 8 గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.
108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి బంగారు, వెండి బల్లులను తాకితే దోషనివారణ జరుగుతుందని నమ్మకం. పురాణ గాథ ప్రకారం.. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు.
శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో వుండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా వుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం.





