
‘మీరు హిందువులు కాబట్టి సిక్కులతో కలిసి వెళ్లలేరు’.. అంటూ భారత్‌కు చెందిన హిందూ భక్తుల బృందాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. దీంతో గురునానక్ దేవ్ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పాక్ వెళ్లిన ఏడుగురు హిందూ భక్తులు.. కుటుంబ సభ్యులతో సహా వెనక్కి తిరిగి వచ్చారు.
కాగా, దాదాపు 1,900 మంది సిక్కు భక్తులున్న ఒక బృందం, గురు నానక్ దేవ్ ‘ప్రకాశ్ పర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం అటారీ–వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది. ‘ఏడుగురు సభ్యుల బస్సు టికెట్ల కోసం 95,000 పాకిస్తానీ కరెన్సీ ఖర్చు చేశాం’.. అని బృంద సభ్యుడైన అమర్ చంద్ తెలిపారు. ఆ తర్వాత ఐదుగురు పాకిస్తాన్ అధికారులు వచ్చి ‘మీరు హిందువులు కాబట్టి.. సిక్కుల జాతాతో వెళ్లలేరని మాతో చెప్పారు’.. అని పేర్కొన్నారు.
అనంతరం తమను వెనక్కి పంపేశారని తెలిపారు. బస్సు టికెట్ల కోసం ఖర్చు చేసిన డబ్బును కూడా వెనక్కి ఇవ్వలేదని వివరించారు. గతంలో పాకిస్తాన్ జాతీయుడైన చంద్, 1999లో భారత్‌కు వచ్చి 2010లో భారత పౌరసత్వం పొందారు. ముందుగా, పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గురు నానక్ దేవ్ ‘ప్రకాశ్ పర్బ్’కు సిక్కు భక్తులను పాకిస్తాన్‌కు పంపడానికి కేంద్రం నిరాకరించింది. అనంతరం సిక్కుల ‘జాతా’ను పాకిస్తాన్‌లోని గురుద్వారాల సందర్శనకు అనుమతించింది.





