News

వంశధారలో బాలియాత్రకు శ్రీకారం

45views

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 9న శ్రీముఖలింగం సమీపంలో వంశధార నదిలో చేపట్టనున్న బాలి యాత్ర దీపారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వంశధార నదిలో దీపారాధన చేశారు. తెప్పలు విడచిపెట్టి బాలియాత్రను ప్రారంభించారు. అనంతరం వంశధార నదికి కుంభ హారతిని అందించి పూజలు చేశారు.

పటిష్ఠ బందోబస్తు …
శ్రీముఖలింగంలో ఈనెల 9న నిర్వహిస్తున్న బాలియాత్ర సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నరసన్నపేట సీ.ఐ. ఎం.శ్రీనివాసరావు తెలిపారు. వంశధార నదిలో తెప్పలు విడచిపెట్టే ప్రాంతాన్ని, ఆలయాన్ని బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశధార నదిలో అరటి తెప్పలు విడచిపెట్టే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు నదిలోనికి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నదికి వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిశీలనలో ఎస్‌.ఐ బి.అశోక్‌బాబు, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, సర్పంచ్‌ సతీష్‌, ఎంపీటీసీ సభ్యుడు హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయండి
కళింగ సామ్రాజ్య చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే బాలి యాత్రలో అందరూ పాల్గొని విజయవతం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు ఎల్‌.కరుణాకర్‌ పిలుపునిచ్చారు. బాలి యాత్ర ఆహ్వాన పత్రికను స్థానిక కొత్తమ్మతల్లి ఆలయంలో అయ్యప్ప స్వాములతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 9న శ్రీముఖలింగంలోని మధుకేశ్వరస్వామి సన్నిధిలో… వంశధార నదీ తతీరంలో బాలి యాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రపంచానికి నౌకా వర్తకాన్ని పరిచయం చేసిన కళింగ ప్రాంత పూర్వీకుల వైభవాన్ని చాటి చెప్పాలని ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు ధూపాన రామణారెడ్డి, కమ్మకట్టు శ్రీనివాసరెడ్డి, నౌపడ మురళీధరరావు పట్నాయక్‌, మెట్ట కాళేశ్వరరావు, మెట్ట సింహాచలం, జనార్దన గురుభవాని తదితరులు పాల్గొన్నారు.