
( కార్తిక పౌర్ణమి – గురునానక్ జీ ప్రకాశ్ ఉత్సవ్ )
ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికచింతన లాంటివి ఉత్తమ మానవుడిలోని దివ్యసంపద. ఇవి లోపించినప్పుడు ఎన్ని సిరిసంపదలు ఉన్నా వృథా. బాహ్య ప్రపంచాన్ని జయించాలనుకునే ముందు స్వీయలోపాలను సరిదిద్దుకోవడం అత్యంత ముఖ్యం. అహంకారం మనిషికి అతి పెద్ద శత్రువు. దానిని విడనాడి వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలి. మతం, కులం, తెగలకు అతీతంగా మనుగడ సాగించాలి. మానవసేవే మాధవసేవ అనే సూక్తికి సమాంతరంగా సేవాదృక్పథాన్ని అనుసరించాలి. ఇది సిక్కు మత ప్రవక్త గురునానక్ ప్రబోధం. సామాజిక అంశాలను ఆధ్యాత్మికతకు జోడిరచి మానవ జాగృతికి తపించిన మహనీయుడు గురునానక్. ఈ సృష్టిలో ఎవరి కన్నా ఎవరూ తక్కువా, ఎక్కువా కాదని బోధించారు. స్త్రీ,పురుషుల మధ్య వివక్షను నిరసించారు.
మానవ మనుగడకు డబ్బు అవసరమే కానీ డబ్బే ప్రధానం కాదన్నారు నానక్. ‘డబ్బును జేబులో దాచుకోవాలి కానీ గుండెల్లో కాదు.’ అనేవారు. ఆర్జించిన దానిలో పదోవంతును అలా వినియోగించాలంటూ ‘దశ్వాంద్’ అనే భావనను ప్రవేశపెట్టారు. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు. దానిని ఆచరించి చూపారు. సమాజంలో విశేష మన్ననలు అందుకుంటున్నా పొలాలలో పనిచేస్తూ జీవనం సాగించి ఆదర్శంగా నిలిచారు. ‘స్వార్థాన్ని వీడి ఉన్నంతలో సత్కార్యాలు ఆచరించడమే ముక్తికి మార్గం. నిజాయతీతో కూడిన సత్ప్రవర్తనతో జీవించడం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, మంచి నడవడిక కలిగి ఉండడమే భగవంతుని చేరేందుకు ఏకైక అర్హత’ అన్నది ఆయన సందేశం. భగవంతుడు జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్ కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు.
మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ప్రేమను పొందకలిగిన వారే భగవంతుడిని చూడగలరని గురునానక్ ప్రబోధించారు. టిబెట్, అరేబియా, దక్షిణాసియా దేశాలతో పాటు అవిభక్త భారత్‌లో ఐదుసార్లు పర్యటించి తన వాణిని వినిపించారు. వీటినే ‘ఉదాసీ’ యాత్రలు అంటారు. నానక్ చూపిన మార్గమే సిక్కుమతంగా రూపుదిద్దుకుంది. గురుశిష్య సంబంధాలను పటిష్ట పరుస్తూ సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు.
నేటి పాకిస్తాన్‌లోని రావీ నదీతీరంలోని నన్కానా సాహిబ్‌లో సంప్రదాయ కుటుంబంలో 1469లో జన్మించిన నానక్ ఐదేళ్ల వయస్సు నుంచే నిరంతరం దైవ నామస్మరణ చేస్తుండేవారట. చిన్నతనం నుంచి ప్రశ్నించి, ఆలోచించే తత్త్వం కలిగిన ఆయన హిందూధర్మంలోని తాత్త్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదలివెళ్లారు. ఆయన సోదరి బీబీ నాన్కీ, తమ్ముడు అత్యంత పిన్న వయస్సులోనే ఆయనలోని దైవత్వాన్ని చూడగలిగారు. అప్పట్లో ఆమె దీనిని బహిర్గతం చేయకపోయినా, అనంతర కాలంలో గురునానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరుపొందారు.
ఏ రంగంలోనైనా సమర్థతే గణనీయం తప్ప వారసత్వం కాదన్నది గురునానక్ నిశ్చితాభిప్రాయంగా చెబుతారు. సమర్థ పాలకులతోనే సుపరిపాలన అందుతుందన్నట్లే సమర్థ గురువులతోనే జ్ఞానం అందుతుందని విశ్వసించారు. అందుకే ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు ఉన్నప్పటికీ గురుపరంపర వారసులుగా వారిని ప్రకటించలేదు. తన శిష్యుడు లెహ్నాను గురుపీఠం వారసునిగా ఎంపిక చేశారు. ఆయనే గురు అంగద్‌గా ప్రసిద్ధులు. ఈ సంవత్సరం నవంబరు5న గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గురునానక్ విశ్వజనీన సందేశాన్ని అనుసరించే ప్రయత్నం చేయడం ఆయనకు మనం అందించే సరైన నివాళి అవుతుంది.





