
చిన్నారులు ధరించే స్కూల్ యూనిఫాం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది వాళ్లకు ఇబ్బందే. ఎందుకంటే యూనిఫాంకి వాడే వస్త్రంలో కృత్రిమ రంగుల వాడకం ఎక్కువగా ఉండటంవల్ల చర్మంపైన దద్దుర్లు రావడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడం, హార్మోన్లలో మార్పులు వంటి అనారోగ్య సమస్యలతో చిన్నారులు సతమతమవుతున్నారట. మనదేశం సహా మరికొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ఈ సున్నితమైన సమస్యకు వియత్నాం ప్రభుత్వం మంచి పరిష్కారం తీసుకొచ్చింది. పిల్లల చర్మానికి ఏ ఇబ్బందీ కలిగించకుండా, తేలికగా… సౌకర్యవంతంగా ఉండేలా అరటినారతో స్కూల్ దుస్తుల్ని రూపొందిస్తోంది. వేడీ, ఉక్కబోతా ఎక్కువగా ఉండే వియత్నాంలో ఈ దుస్తులు చెమటని పీల్చుకుని పిల్లలని సౌకర్యంగా ఉంచుతున్నాయి. అలాగే వాడేసిన తర్వాత పాలిస్టర్‌లా కాకుండా వేగంగా భూమిలో కలిసిపోతూ పర్యావరణానికీ మేలు చేస్తున్నాయి. అరటిపంట చేతికొచ్చాక వృథాగా పడి ఉండే అరటిబోదెల నుంచి ఈ నారని సేకరించి, వాటితో దుస్తులని రూపొందిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో అటు వ్యవసాయ వ్యర్థాలకీ, ఇటు యూనిఫాం సమస్యలకీ కూడా పరిష్కారం దొరికిందన్నమాట.





