
విదేశీ సంస్థల ద్వారా నిధులు స్వీకరిస్తూ, మత ప్రచారాన్ని చేస్తున్న ఖలీలబాద్ లోని మదర్సా మేనేజర్ మౌలానా షంసుల్ హుదాఖాన్ పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాడని, విదేశీ లావాదేవీల్లో పాల్గొంటున్నట్లు కూడా పోలీసులు పేర్కొంటున్నారు.
వారణాసి యూనిట్లోని యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) నిర్వహించిన విస్తృత దర్యాప్తు తర్వాత మౌలానాపై కేసు నమోదు అయ్యింది. విదేశీ సంస్థల ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడని, విద్య పేరుతో మత ఛాందసాన్ని తీవ్రంగా బోధిస్తున్నాడని కూడా పోలీసుల విచారణలో తేలింది.
ATS నివేదిక ప్రకారం, హుడా 2007 నుండి 2017 వరకు ఉత్తర ప్రదేశ్ మదర్సా బోర్డు లేదా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా యునైటెడ్ కింగ్డమ్లో నివసించాడు.విదేశాల్లో ఉన్న సమయంలో, అతను 2013 లో బ్రిటిష్ పౌరసత్వాన్ని పొందాడు. అలాగే ఇస్లామిక్ సమావేశాలు, ఉపన్యాసాలు కూడా ఆన్ లైన్ ద్వారా నిర్వహించినట్లు తేలింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, హుదా పాకిస్తాన్ మరియు జమ్మూ కాశ్మీర్లోని వ్యక్తులు మరియు సంస్థలతో సంబంధాలను కొనసాగించాడు. అలాగే భారత్ లో ఇస్లామీకరణ, సైద్ధాంతిక విస్తరణ కోసం అనేక నెట్ వర్క్ లను కూడా వాడుకున్నాడని తేలింది.
అతను 2017 లో భారతదేశానికి తిరిగి వచ్చి, ఖలీలాబాద్ లో కుల్లియతుల్ బనాతిర్ రాజ్ వియా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ బ్యానర్లో మదరసా కుల్లియతుల్ బనాతిర్ రాజ్వియాను స్థాపించాడు. అలాగే రజా ఫౌండేషన్ ను కూడా స్థాపించాడు.
ATS నివేదిక ప్రకారం, రెండు సంస్థలను విద్య మరియు సంక్షేమ ప్రయోజనాల కోసం విదేశీ నిధులను సేకరించాడని, కానీ కొంత డబ్బును వ్యక్తిగతంగా, విలాసాల కోసం వాడుకున్నాడని కూడా తేలింది. మరో వైపు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA), 1999 యొక్క సంబంధిత నిబంధనల కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.





