News

భువనేశ్వర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం

57views

భువనేశ్వర్‌లోని ఆచార్య విహార్ విద్యా సంస్థలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరిగింది. దాదాపు 500 మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో ఒడిశా (పూర్వ) సహ సంపర్క్ ప్రముఖ్ డాక్టర్ బసంత్ పాటి మార్గనిర్దేశనం చేశారు. భారత దేశంలోని యువత అపరిమిత సామర్థ్యాన్ని కలిగి వున్నారని, దేశభక్తి, నిస్వార్థత సేవతో దేశానికి తమను తాము అంకితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పంచపరివర్తన్ ఆచరణ బాధ్యత యువతదేనంటూ.. భారత్ తిరిగి విశ్వగురు స్థానాన్ని పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత్ లోని యువత అత్యంత స్ఫూర్తితో, దేశ భక్తితో పనిచేస్తే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తప్పకుండా ఆవిర్భవిస్తుందని బసంత్ పాటి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ భావజాలానికి తగ్గట్టుగా వాతావరణం వుందని, దేశభక్తిని జీర్ణం చేసుకోవాలని, దీంతో సమాజం పట్ల తమ కర్తవ్య భావాన్ని పెంపొందించుకోవాలని ఆయన యువతకు సూచించారు.

ఇక.. సంఘ్ స్థాపించినప్పటి నుంచీ హిందూ సమాజ సంఘటితం కోసం, దేశాన్ని శక్తిమంతం చేయడానికి అవిశ్రాంత కృషి చేస్తూనే వుందన్నారు. అలాగే సంఘ వందేళ్ల ప్రయాణాన్ని యువకులకు పూర్తిగా వివరించారు. భారత్ అన్ని సంవత్సరాల పాటు విదేశీ పాలనలో మగ్గడానికి గల కారణాలను సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్జీ లోతుగా ఆలోచించారని, అధ్యయనం కూడా చేశారన్నారు. దేశంపై అభిమానం, స్వ అన్న ఆలోచన లేని కారణంగానే అలా జరుగుతోందని, ఆత్మన్యూనతలో వుండిపోయారని, అందుకే సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత వుందని డాక్టర్జీ గ్రహించారని వివరించారు.

ఇక.. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా పంచపరివర్తన్ అన్న దానిని స్వీకరించిందని, దానిని ఆచరించేలా చూడాల్సిన బాధ్యత యువకులపై వుందన్నారు. దీనిపై సమాజానికి పూర్తి అవగాహన కల్పించాలని కూడా సూచించారు. దీని ద్వారా సమాజంలో భారీ పరివర్తన వస్తుందని, దీనికి యువకులు వారధిగా మారాలని పిలుపునిచ్చారు.

ఇక.. స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు అయినా.. మన దేశంలో వలసవాద విధానాలు ఎలా పేరుకుపోయాయో కూడా బసంత్ పాటి యువకులకు వివరించారు. దేశంలో స్వావలంబన, స్వ అన్న భావన లేకపోవడం వల్లే దేశంలో ఇంకా వలసవాద విధానాలు కొనసాగుతున్నాయని వివరించారు.

ఈ సమావేశంలో, భువనేశ్వర్ జిల్లా సంఘచాలక్ శ్రీనివాస్ మానసింగ్ కూడా పాల్గొన్నారు. సమాజం పట్ల ప్రతి పౌరుడూ నైతిక విధిని నిర్వర్తించాలని సూచించారు. సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి దానికి రుణపడి వుంటాడని, ఆ రుణాన్ని తీర్చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై వుంటుందన్నారు. సమాజానికి సేవ చేయడానికి సంపద, అధికారం లేదా అధికారిక విద్య అవసరం లేదు; దృఢ సంకల్పం, అపారమైన ప్రేమ అవసరం అని వివరించారు.